గట గటా…

Jan 18,2024 22:18 #గట గటా...
జిల్లాలో సంక్రాంతి పండగ వేళ మద్యం ఏరులై
  • పండగ వేళ తెగ తాగిన మద్యం ప్రియులు
  • నాలుగు రోజుల్లో రూ.33.82 కోట్ల ఆదాయం
  • గతేడాదితో పోలిస్తే రూ.1.46 కోట్ల పెరుగుదల
  • గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో సంక్రాంతి పండగ వేళ మద్యం ఏరులై పారింది. పండగ రోజుల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. పండగ రోజులు మద్యం దుకాణాలు కళకళలాడాయి. వారంతో సంబంధం లేకుండా మద్యం ప్రియులు తెగ తాగారు. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు సాగిన విక్రయాలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే రూ.కోట్లు అదనంగా ప్రభుత్వ ఖజానాకు చేరింది. బెల్టుషాపులు లేవని ప్రభుత్వం చెప్తున్నా, ప్రభుత్వానికి ఈ సంవత్సరం ఆదాయం పెరగడంలో వాటి పాత్రే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ గాక మద్యం పెంపు కోసం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం చేపట్టిన చర్యలూ మద్యం అమ్మకాల పెరుగుదలకు దోహదపడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 193 మద్యం దుకాణాలు, 23 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. సంక్రాంతి పండగ కావడంతో ఈనెల 14వ తేదీ నుంచే మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. 17వ తేదీ వరకు మద్యం అమ్మకాలు ఆ జోరు కొనసాగింది. నాలుగు రోజుల్లో మొత్తం రూ.33,82,07,210 మేర అమ్మకాలు సాగినట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే సమాయానికి రూ.32,35,43,460 మేర అమ్మకాలు సాగాయి. గతేడాదితో పోలిస్తే రూ.1,46,63,750 మేర పెరిగింది. నాలుగు రోజుల్లో ఈనెల 16న కనుమ రోజు అత్యధికంగా రూ.9.22 కోట్ల మేర ఆదాయం సమకూరింది. మద్యం అమ్మకాలు పరిశీలిస్తే, ఈనెల 14న 9,983 కేసుల లిక్కర్‌, 3,390 కేసుల బీరు అమ్మకాలు సాగాయి. 15న 9,763 కేసుల లిక్కర్‌, 4,234 కేసుల బీరు అమ్మారు. కనుమ రోజున 9,559 కేసుల లిక్కరు, 5,283 కేసుల బీరు విక్రయించారు. ముక్కనుమ రోజైన 17న 7,496 కేసుల లిక్కరు, 3,075 కేసుల బీరు అమ్మారు.మద్యం అమ్మకాల వివరాలుతేదీ ప్రస్తుతం అమ్మకాలు గతేడాది అమ్మకాలు(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)14 8.81 7.7315 8.92 8.7416 9.22 8.4717 6.86 7.42మొత్తం 33.82 32.35పిన్నింటిపేటలో అత్యధికంగా అమ్మకాలుపండగ సీజన్‌లో ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు ఎక్కువగా సాగినట్లు తెలుస్తోంది. వలసలు వెళ్లిన వారంతా పండగకు సొంత గ్రామాలకు రావడంతో అక్కడ మద్యం అమ్మకాలు అధికంగా సాగినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోలాకి మండలం పిన్నింటిపేటలో కనుమ రోజున అత్యధికంగా మద్యం విక్రయాలు సాగాయి. ఇక్కడ ఒక్కరోజు గరిష్టంగా రూ.9.5 లక్షల ఆదాయం సమకూరింది. తర్వాత స్థానాల్లో ఎచ్చెర్ల మండలం సీపన్నాయుడుపేట, బూర్జ మండలం కొల్లివలస రూ.తొమ్మిది లక్షల పైబడి అమ్మకాలు సాగినట్లు తెలుస్తోంది.గణనీయంగా పెరిగిన లిక్కరు అమ్మకాలుపండగ సీజన్‌లో ఈ ఏడాది లిక్కరు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 10.90 శాతం పెరిగాయి. పండగ నాలుగు రోజుల్లో గతేడాది 33,185 కేసుల లిక్కరును విక్రయించగా, ఈ ఏడాది 36,801 కేసులు అమ్ముడుపోయాయి. భోగి రోజుల భారీగా పెరిగాయి. ముక్కనుమ రోజు మాత్రం తగ్గాయి. గతేడాది భోగి రోజున 8,331 కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది 9,983 కేసులు (19.83 శాతం) అమ్మకాలు సాగాయి. సంక్రాంతి రోజున గతేడాది 8,739 కేసులు విక్రయించగా, ఈ ఏడాది 9,763 కేసులు (అదనంగా 11.72 శాతం) అమ్ముడయ్యాయి. కనుమ రోజున గతేడాది 8,497 కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది 9,559 కేసులు (12.50 శాతం) విక్రయించారు. ముక్కనుమ రోజున గతేడాది 7,618 కేసులు విక్రయించగా, ఈ ఏడాది 7,496 కేసుల అమ్మకాలు సాగి 1.60 శాతం మేర తగ్గాయి.తగ్గిన బీరు అమ్మకాలుపండగ సీజన్‌లో ఈ సంవత్సరం బీరు అమ్మకాలు 2.5 శాతం మేర తగ్గాయి. పండగ నాలుగు రోజుల్లో కలిపి గతేడాది 16,392 కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది 15,982 కేసులను విక్రయించారు. భోగి రోజున గతేడాది 2,912 కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది 3,390 కేసులు (అదనంగా 16.41 శాతం) విక్రయించారు. సంక్రాంతి రోజున గతేడాది 4,684 కేసుల బీరు అమ్మకాలు సాగగా, ఈ ఏడాది మాత్రం 4,234 కేసులు (9.61 శాతం తగ్గుదల) విక్రయాలు సాగాయి. గతేడాది కనుమ రోజున 4,784 కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది 5,283 కేసులు (అదనంగా 10.43 శాతం) విక్రయించారు. ముక్కనుమ రోజున బీరు అమ్మకాలు భారీగా పడిపోయాయి. గతేడాది 4,012 కేసుల బీరు అమ్మగా, ఈ ఏడాది 3,075 కేసులు (23.35 శాతం తగ్గుదల) మాత్రం అమ్మకాలు సాగాయి.అమ్మకాల పెరుగుదలకు కారణాలు ఇవే…మద్యం అమ్మకాలు ఈ ఏడాది పెరగడానికి బెల్టు షాపులు బాగా దోహదపడ్డాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే దుకాణాల సంఖ్యలోనూ పెద్దగా పెరుగుదల లేదు. గతేడాది 186 దుకాణాలు ఉంటే ప్రస్తుతం 192 షాపులు ఉన్నాయి. బెల్టుషాపులపై చూసీచూడనట్లు వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి అంతర్గతంగా మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. మద్యం నిల్వలు భారీగా పట్టుబడితే తప్ప కేసులు పెట్టొద్దని సూచించినట్లు సమాచారం. దీంతో యథేచ్ఛగా బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు సాగాయి. మరోవైపు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఇబి) అధికారుల చర్యలూ ఫలించాయి. నాటుసారా తయారీని అరికట్టడంతో ప్రత్యామ్నాయం లేక దానిపై ఆధారపడిన వారంతా ప్రభుత్వ మద్యం సేవించడంతో అమ్మకాల పెరుగుదలకు దోహదపడినట్లు తెలుస్తోంది.

➡️