గడప దాటని పనులు

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అందిస్తున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటినీ ఎమ్మెల్యేలు సందర్శించేలా

మెళియాపుట్టి మండలంలో వీరన్నపేట-గొట్టిపల్లి రహదారి దుస్థితి

రూ.80.53 కోట్లతో 2,685 పనులకు పాలనా అనుమతులు

ఇప్పటివరకు 14.84 కోట్ల విలువైన 479 పనులే పూర్తి

పనులపై ఎన్నికల ప్రభావం

పాత పనులకు బిల్లులు రాకపోవడం మరో కారణంగడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో విస్తృతంగా సచివాలయాలు సందర్శించేలా నిరంతరం పర్యవేక్షించింది. సచివాలయాల సందర్శనలో వెనుకబడిన ప్రజాప్రతినిధులపై ప్రత్యేక దృష్టిసారించి వారికి హెచ్చరికలు సైతం జారీ చేసింది. జిల్లాలో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరూ తమ పరిధిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజాప్రతినిధులు పర్యటనల స్థాయిలో వారు ప్రతిపాదించిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. గతంలో పనులు చేపట్టిన వారికి బిల్లులు రాకపోవడంతో వైసిపి స్థానిక నాయకులెవరూ ముందుకు రావడం లేదు. పైగా ఎన్నికల సంవత్సరం కావడంతో పనులు చేయడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల అనంతరం ఒకవేళ ప్రభుత్వం మారితే బిల్లులు రావని భావిస్తున్న నాయకులు, పనులకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అందిస్తున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటినీ ఎమ్మెల్యేలు సందర్శించేలా ప్రభుత్వం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 2022 మే 11న ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లాలని ప్రజాప్రతినిధులను ఆదేశించింది. ఇందులో భాగంగా వారు పర్యటించిన ప్రాంతాల్లో మౌలిక వసతులు, కనీస సౌకర్యాల కోసం సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున కేటాయిస్తూ 2022 ఆగస్టు 17న జిఒ నంబరు 123 విడుదల చేసింది. పనుల గుర్తింపు, మంజూరు, నిర్వహణ, పర్యవేక్షణపై ప్రత్యేక మార్గదర్శకాలను వెలువరించింది. అందుకనుగుణంగా జిల్లాలో గతేడాది ఆగస్టు నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాల సందర్శన మొదలుపెట్టారు. జిల్లాలో 732 సచివాలయాలు ఉండగా అందరూ కలిపి 650కి పైగా సచివాలయాలను సందర్శించారు. ప్రజాప్రతినిధుల నుంచి ఇప్పటివరకు 2,685 పనులకు సంబంధించి మాత్రమే ప్రతిపాదనలు రాగా వాటికి అనుమతులు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. వీటికి రూ.80.53 కోట్ల మేర పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఇప్పటివరకు రూ.14.84 కోట్ల విలువైన 479 రకాల పనులు పూర్తయ్యాయి. మరో 1294 పనులు ప్రగతిలో ఉన్నాయి.పనుల మంజూరులో సాంకేతిక ఇబ్బందులుపనుల మంజూరుకు కొన్నిరకాల సాంకేతిక కారణాలూ ఉన్నాయి. సచివాలయాల వారీగా గుర్తించిన పనుల జాబితాను ఎంపిడిఒలు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పంపుతున్నారు. వాటిలో నిబంధనల ప్రకారం ఉన్న పనులకు ఉన్నతాధికారులు అనుమతులు జారీ చేస్తున్నారు. లేని పక్షంలో పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఈ కారణంతో పనుల్లో కొంత జాప్యం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.పనులపై ఎన్నికల ప్రభావంగడప గడపకూ పనులను గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలతో పాటు స్థానిక వైసిపి నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పనులు చేస్తున్నా సకాలంలో బిల్లులు రావడం లేదని వారు చెప్తున్నారు. దీంతోపాటు గతంలో ముఖ్యమంత్రి డెవలప్‌మెంట్‌ నిధులు (సిఎండిఎఫ్‌)తో పనులు చేసినా, ఆ డబ్బులు ఇప్పటివరకు రాలేదు. గడప గడపకూ మన ప్రభుత్వం పనులు ముందుకు సాగకపోవడంపై ఎన్నికల ప్రభావం కొంతపడినట్లు చర్చ నడుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో చేపట్టిన పనులకు ఇప్పుడు బిల్లులు రాకపోతే తర్వాత వస్తాయో, లేదోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే గతంలో టిడిపి నాయకుల పరిస్థితే తమకూ ఎదురవుతుందని అనుకుంటున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు ఇప్పటికీ కొందరికి డబ్బులు రాలేదు. దీంతో కొత్తగా డబ్బులు మదుపు పెట్టడానికి ఎవరూ సాహహించడం లేదు. ఫలితంగా పనులు ముందుకు సాగడం లేదు.

 

➡️