గ్రామీణ బంద్‌ విజయవంతంపై బైక్‌ ర్యాలీ

రైతు, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన ఈ నెల 16న పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి- పలాస

రైతు, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన ఈ నెల 16న పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌ విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు ఎన్‌.గణపతి పిలుపునిచ్చారు. ఈ మేరకు కాశీబుగ్గ పెట్రోల్‌ బంక్‌ దరి పెంట దాలయ్య ఆశ్రమం నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి, అక్కడి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఇందిరా చౌక్‌ మీదుగా పలాస జూనియర్‌ కాలేజి వరకు సోమవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంద్రంలోని మోడీ ప్రభుత్వం విధానాల వల్ల రైతులు, కార్మికులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందించే చర్యలు చేపట్టడం లేదన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించి అమలు చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యవసాయంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, గనులు, సహజ వనరులు సైతం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. కార్పొరేట్లకు ఆటంకంగా ఉండకూడదని నలబై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చేసి కార్మికులను కార్పొరేట్ల బానిసలుగా తయారు చేయాలని చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.వేణుగోపాల్‌, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీ నాయకులు టి.సన్యాసిరావు, ఎఐసిసిటియు నాయకులు డి.శ్రీనివాస్‌, ఐద్వా నాయకులు ఎన్‌.ఢిల్లేశ్వరి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డి.భాస్కరరావు, జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరుకుమార్‌, భవన నిర్మాణ సంఘం నాయకులు సింహాచలం, ఎఐకెఎంఎస్‌ నాయకులు వి.పాపయ్య, ఎఐకెఎం నాయకులు ఎం.రామరావు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదమైన విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నామమాత్రంగా తీర్మానం చేసి ఊరుకున్నారని, పార్లమెంట్‌లో తమ ఎంపీలతో, రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలతో కేంద్రంపై పోరాటానికి ఎందుకు వెనకంజ వేస్తున్నారని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకల మాధవరావు అన్నారు. మండలంలోని కాశీబుగ్గ సూదికొండలో సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు.

 

➡️