గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌

గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న గొండు శంకర్‌

సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ, గ్రామ స్వరాజ్యాన్ని జగన్‌ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌ విమర్శించారు. గాంధీ వర్థంతిని పురస్కరించుకుని గ్రామ స్వరాజ్య వ్యవస్థకు పూర్వ వైభవం కల్పించాలన్న డిమాండ్‌తో సర్పంచ్‌ల సంఘం, పంచాయతీరాజ్‌ అభియాన్‌ ఆధ్వర్యాన నగరంలోని గాంధీపార్కులో గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్‌లకు విలువ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థకు పూర్వ వైభవం కల్పించాలన్నారు. సర్పంచ్‌ల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న సర్పంచ్‌ల ఆలోచనలపై జగన్‌ ప్రభుత్వం నీళ్లు చల్లి పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను సైతం కొల్లగొడుతోందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వంలో సర్పంచ్‌ల వ్యవస్థకు మనుగడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం సర్పంచ్‌లకు కల్పించిన 29 అధికారాల విధులు, 16 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి లక్షలాది రూపాయలను వడ్డీలకు తెచ్చి అప్పులపాలయ్యామని, కొంతమంది సర్పంచ్‌లు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఛాంబర్స్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనెపు రామకృష్ణ, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పి.వెంకట భానోజీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి బి.అప్పలనాయుడు, సంఘ నాయకులు, సర్పంచ్‌లు కె.అదినారాయణ, బి.గౌరీపతిరావు, ఆర్‌.లకీë రమణమూర్తి, బి.రామారావు, మూకళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️