గ్రూపుల గోల.. చల్లారేదెలా?

ఆమదాలవలస నియోజకవర్గంలో అధికార పార్టీని గ్రూపుల గోల

సమావేశంలో మాట్లాడుతున్న వైసిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి

వైసిపి విస్తృతస్థాయి సమావేశానికి సువ్వారి గైర్హాజరు

శ్రీ అధికార పార్టీ శ్రేణుల్లో ఆందోళన

ప్రజాశక్తి – ఆమదాలవలస

ఆమదాలవలస నియోజకవర్గంలో అధికార పార్టీని గ్రూపుల గోల వెంటాడుతోంది. వైసిపి నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ విస్తృత సమావేశానికి సువ్వారి గాంధీ గ్రూపు గైర్హాజరైంది. గురువారం పట్టణంలోని ఓ ప్రయివేటు కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి వైసిపి నాయకులు, కార్యకర్తలతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించగా, వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి సువ్వారి గాంధీ, కోట గోవిందరావు గ్రూపులు దూరంగా ఉన్నాయి. సమావేశం చివరిలో చింతాడ రవికుమార్‌ హాజరైనా ఆయనను వేదికపైకి పిలవలేదు. దీంతో వేదిక కిందే కార్యకర్తలతో కలిసి ఆశీనులయ్యారు. సమావేశం ముగిశాక వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ కోఆర్డినేటర్‌ మజ్జి శ్రీనివాసరావును కలిసి కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి వెనుతిరిగారు. సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి గుంపుగా వస్తున్నాయని, వైసిపి నాయకులు, కార్యకర్తలు వారి కుయుక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మభ్యపెట్టి ఎలాగైనా గెలవాలని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలోనూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలకు మొండి చేయి చూపారన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం, ఎమ్‌పిగా పేరాడ తిలక్‌ పోటీ చేస్తున్నారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు చేసిన మేలును కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అర్థమయ్యేటట్లు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌, నాయకులు పేరాడ తిలక్‌, కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ దుంపల లక్ష్మణరావు, ఎం.వి.పద్మావతి, తమ్మినేని చిరంజీవి నాగ్‌, మెంటాడ స్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు.అసమ్మతి నాయకుల దారెటుస్థానిక సంస్థల ఎన్నికల నుండి స్పీకర్‌ తమ్మినేని సీతారాం, సీనియర్‌ నాయకులు సువ్వారి గాంధీ మధ్య నెలకొన్న మనస్పర్థలు నేటికీ చల్లారడం లేదు. రాష్ట్ర, జిల్లా నేతలు ఎన్నిమార్లు సర్దిచెప్పినప్పటికీ నేటికి వారి మధ్య సయోధ్య కుదరకపోవడం గమనార్హం. తాజాగా విస్తృతస్థాయి సమావేశానికి వైసిపి రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ కోఆర్డినేటర్‌ మధ్య శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ హాజరైనా, వైసిపి వ్యతిరేక గ్రూపులుగా ఉన్న సువ్వారి గాంధీ, సీనియర్‌ నాయకులు కోట గోవిందరావు హాజరు కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఎన్నికల నాటికి పరిస్థితులు ఎటువైపు మళ్లుతాయోనని వైసిపి శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

➡️