చంద్రబాబు చివరి అస్త్రం షర్మిల

టిడిపి అధినేత చంద్రబాబు

ధర్మాన కృష్ణదాస్‌, వైసిపి జిల్లా అధ్యక్షులు

  • వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌

ప్రజాశక్తి – నరసన్నపేట

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చివరి అస్త్రం షర్మిల అని, వైఎస్‌ అభిమానుల ఓట్లు చీలితే తనకు కొంతైనా కలిసొస్తుందని బాబు భావిస్తున్నారన్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదనే వాస్తవాన్ని వారిరువురూ గుర్తించాలన్నారు. పిసిసి అధ్యక్ష బాధ్యతల స్వీకరణ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును సిఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. అందుకే పచ్చ మీడియా షర్మిలను భుజాలకెత్తుకుందని తెలిపారు. వైఎస్‌ మరణాంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బంది పెట్టలేదా?, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించలేదా అని ఆయన ప్రశ్నించారు. అడ్డగోలుగా విభజన చేసిన ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అంపశయ్యపై ఉందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణ నుంచి ఎపికి హఠాత్తుగా షర్మిల ఎందుకు షిఫ్ట్‌ అయ్యారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ బిల్డప్‌ ఇచ్చి ఇప్పుడు అదే నోటితో జగన్‌ రెడ్డి అని సంబోధించడం ఎలాంటి నైతికత అని ప్రశ్నించారు. మహా నేత కీ.శే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిరకాల ప్రత్యర్థి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన షర్మిల వైఎస్‌ ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. రాష్ట్రంలో మళ్లీ గెలిచేది వైసిపి అని, సిఎం అయ్యేది జగన్మోహన్‌ రెడ్డి మాత్రమేనన్నారు. ఇలాంటి షర్మిలలను ఎందరిని తెచ్చినా చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు.

 

 

➡️