చలో విజయవాడ భగ్నానికి యత్నం

కనీస వేతనాలు

ఎల్‌ఎన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఆశావర్కర్లు

  • ఎక్కడికక్కడ ఆశావర్కర్ల అరెస్టులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

కనీస వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆశావర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన ఆశావర్కర్లు ఈనెల ఎనిమిదో తేదీన చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమ భగ్నానికి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. ఆశావర్కర్లు విజయవాడ వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ వారిని ముందస్తు అరెస్టులు చేశారు. కొందరిని గృహ నిర్బంధం చేయగా, మరికొందరికి నోటీసులు ఇచ్చారు. చలో విజయవాడలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి హాజరు కాబోమని ఆశావర్కర్ల నుంచి సంతకాలను తీసుకునేందుకు ప్రయత్నించారు. జిల్లాలో సుమారు 400 నుంచి 500 మంది ఆశావర్కర్లను ఉదయం ఏడు గంటల నుంచే అరెస్టు చేసి పలు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. విజయవాడ వెళ్తున్న కొందరిని మార్గమధ్యంలో అరెస్టు చేశారు. రాత్రి ఏడు గంటల తర్వాత వారిని ఇళ్లకు విడిచిపెట్టారు. గార మండలం నుంచి ప్రయివేట్‌ బస్సులో బయలుదేరిన ఆశావర్కర్లను రణస్థలం వద్ద పోలీసులు బస్సు నుంచి దించేశారు. ఆశావర్కర్ల అక్రమ అరెస్టులను సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, ఆశావర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు కె.నాగమణి వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో చెప్పుకునేందుకు వెళ్తున్న వారిని అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిన ఏ ప్రభుత్వాలూ మనజాలలేదని గుర్తుచేశారు.

అరెస్టుకు ఖండన

ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్‌ పరిష్కారానికి చలో వియవాడకు వెళ్తున్న కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేయడంపై ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.నాగమణి ఒక ప్రకటనలో ఖండించారు. మహిళలని చూడకుండా గృహ నిర్బంధాలు, అరెస్టులకు పాల్పడడం దారుణమన్నారు. ఆశా వర్కర్లపై జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

 

➡️