చెప్పినవన్నీ చేసిన ప్రభుత్వం

ఎన్నికల్లో అమలు చేస్తామని చెప్పిన

మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు

  • రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

ప్రజాశక్తి – పలాస

ఎన్నికల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలన్నీ అమలు చేసిన తొలి ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కాశీబుగ్గ మండల పరిషత్‌ ప్రాంగణంలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన పిఎసిఎస్‌ నూతన భవనాన్ని పలాస కమ్యూనిటీ ఆసుపత్రిలో రూ.5.30 కోట్లతో నిర్మించిన రెండు అంతస్తుల అదనపు భవనాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా వైసిపి ప్రభుత్వ పాలన సాగిందన్నారు. టిడిపి ప్రభుత్వంలో పథకం అందాలంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించే పరిస్థితి ఉండేదని, వైసిపి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థతో ఒక్క పైసా లంచం లేకుండా ఉన్న ఊరిలోనే అన్ని పథకాలూ అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా వంటి కష్టకాలంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించామన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు నాయుడు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ హామీలిస్తున్నారని, ఆయన ఎన్ని ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలోనే పలాస నియోజకవర్గం అభివృది చెందిందన్నారు. నాడు-నేడుతో పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారిపోయాయన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపారు. మేలు చేసే ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, పలాస, వజ్రపుకొత్తూరు పిఎసిఎస్‌ అధ్యక్షులు పైల చిట్టి, దువ్వాడ మధుకెేశ్వరరావు, పలాస, మందస ఎంపిపిలు ఉంగ ప్రవీణ, డొక్కరి దానయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మీసాల సురేష్‌బాబు, జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రతినిధి పి.శ్రీనివాసరావు, ఉంగ సాయి, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు చింతాడ మాధవరావు, తహశీల్దార్‌ ఎల్‌.మధుసూధనరావు, ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.ప్రోటోకాల్‌పై మున్సిపల్‌ చైర్మన్‌ ఆగ్రహంపలాస ప్రభుత్వాస్పత్రిలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకంలో, ఆహ్వాన పత్రికలో ప్రోటోకాల్‌ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో మూలన తన పేరును చిన్నగా వేసి అవమానించారని కోపోద్రిక్తులయ్యారు. పట్టణ ప్రథమ పౌరునిగా కనీస మర్యాద పాటించలేదని, అస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యునిగా తాను ఉన్నా ఒక్క సమావేశానికీ ఆహ్వానించలేదన్నారు. మర్యాద లేని చోట తాను ఉండనని సభకు రాకుండా ఇంటికి వెళ్లిపోయారు.

 

➡️