జాతర్లకు పోటెత్తిన ప్రజలు

మండలంలోని గాజుల కొల్లివలస పంచాయతీ పరిధిలోని సంగమేశ్వర స్వామి కొండ వద్ద జరుగుతున్న మూడు రోజుల జాతరలో

నిలిచిన వాహనాలు

ఆమదాలవలస :

మండలంలోని గాజుల కొల్లివలస పంచాయతీ పరిధిలోని సంగమేశ్వర స్వామి కొండ వద్ద జరుగుతున్న మూడు రోజుల జాతరలో భాగంగా యాత్రికులు అధిక సంఖ్యలో రావడంతో కిటకిటలాడింది. దీంతో అలికాం-బత్తిలి ప్రధాన రహదారి ట్రాఫిక్‌ జామ్‌తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రజలు పలు ఇబ్బందుల ను ఎదుర్కొన్నారు. పోలీసులు విధుల్లో భాగంగా ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రయత్నించినా… అదుపులోకి రాలేదు. ఆమదాలవలస నుంచి హిర మండలం వైపు వెళ్లే వాహనాలు కృష్ణాపురం నుంచి నిలిచిపోయాయి. అలాగే పాలకొండ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు పార్వతీశంపేట రోడ్డుపైన పలు వాహనాలు నిలిచిపోయాయి. హిరమండలం వైపు నుంచి వచ్చే వాహనాలు జొన్నవలస నుంచి అలికాం బత్తిలి ప్రధాన రహదారిపై నిలిచిపోయాయి. మూడు ప్రధాన రహదారులపైన అధిక సంఖ్యలో గంటలు తరబడి వాహనాలు నిలిచిపోవడంతో యాత్రికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటా ఈ విధంగానే ట్రాఫిక్‌ ఎక్కడికి అక్కడ నిలిచిపోతుందని, ముందస్తు చర్యలు చేపట్టడంలో పోలీసులు విఫలం అవుతున్నారని పలువురు గుసగుసలాడుకున్నారు. అలాగే కలివరంలో వల్లభనరాయణ, వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయాల పరిధిలోని కోడోబళ్ల యాత్ర నిర్వహించారు. పరిసర గ్రామాలకు చెందిన తొగరాం, ఇసకలపేట, కొత్తవలస, ముద్దాడపేట, పీరుసాహెబ్‌పేట, కంచరాపువానిపేట గ్రామాల నుంచి యాత్రకు తరలివచ్చారు. పలాస : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో హట్కో కాలనీ పరిధిలో డేకురుకొండ ఉత్సవం సంక్రాంతి సందర్భంగా ఘనంగా జరిగింది. డేకురు కొండ ప్రాంతంలో భీముడు పాదాలు ఉంటాయి. జారుడు బల్ల లాంటి రాళ్లు ఉండటంతో ఏటా నవ దంపతులు వాటిని దర్శించుకుంటారు. కనుమ రోజున నిర్వహించిన యాత్ర పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది.

 

➡️