జిల్లాలో బెంతు ఒరియాలు లేరు

జిల్లాలో బెంతు ఒరియాలు లేరని ఆదివాసీ వికాస్‌

చలో టెక్కలి ర్యాలీ నిర్వహిస్తున్న ఆదివాసీలు

  • నకిలీ బెంతు ఒరియాలను ఎస్‌టిలుగా గుర్తించవద్దు
  • ఆదివాసీ వికాస్‌ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు మధు
  • గిరిజనుల చలో టెక్కలి ర్యాలీ

ప్రజాశక్తి – టెక్కలి

జిల్లాలో బెంతు ఒరియాలు లేరని ఆదివాసీ వికాస్‌ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు అన్నారు. జిల్లాలో ఉన్న నకిలీ బెంతు ఒరియాలను ఎస్‌టిలుగా గుర్తించవద్దని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యాన గిరిజనులు చలో టెక్కలి ర్యాలీని సోమవారం నిర్వహించారు. జిల్లాలో బెంతు ఒ రియాలు లేరని వారికి ఎస్టి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకూడదని తెలియజేస్తూ సోమవారం టెక్కల్లో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక తెంబూరు రోడ్డు నుంచి సబ్‌ కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం టెక్కలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బెంతు ఒరియాల పేరుతో ఉన్న నకిలీ ఎస్‌టి కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో బెంతు ఒరియాల పేరుతో బిసి-ఎకి చెందిన వడ్డి కులస్తులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రెండు వేల నకిలీ ఎస్‌టి కుల ధ్రువీకరణ పత్రాలు పొంది పలు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. వారందరినీ ఉద్యోగాల నుండి తొలగించి సర్టిఫికెట్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వాటి స్థానంలో నిజమైన ఆదివాసీలకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఆదివాసీ వికాస్‌ పరిషత్‌ రాష్ట్ర సహాధ్యక్షులు వాబ యోగి మాట్లాడుతూ ఆదివాసీల మనుగడకు ముప్పు పొంచి ఉందన్నారు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఆదివాసీలను దగా చేస్తూ గిరిజనేతరులను ఎస్‌టి జాబితాలో చేరుస్తామని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. జిల్లాలో బెంతు ఒరియాలు లేరని గతంలో టెక్కలి ఆర్‌డిఒ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారని తెలిపారు. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు వాగ్దానాలు, నకిలీ బెంతు ఒరియాలు చేస్తున్న నిరాహార దీక్షలు బూటకమన్నారు. ఆదివాసీలు సంఘటితమై ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా అధ్యక్షులు గురాడ అప్పన్న, కార్యదర్శి బైదలాపురం సింహాచలం, యడ్ల సూర్యనారాయణ, ఆదివాసీ జెఎసి జిల్లా అధ్యక్షులు సవర రాంబాబు, బి.భాగ్యలక్ష్మి, ఆనందరావు, చింతపల్లి భాస్కర్‌, బెజ్జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️