టిడిపిలో టిక్కెట్ల లొల్లి

టిడిపి మూడో జాబితా జిల్లాలో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

టిడిపి మూడో జాబితా జిల్లాలో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో మంటలు రేపింది. ఆయా నియోజకవర్గాల్లో ఊహించని విధంగా అభ్యర్థులను మార్చడం ఇందుకు కారణంగా ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు శంకర్‌కు, పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావుకు పార్టీ అధిష్టానం టిక్కెట్లు కేటాయించడంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. శ్రీకాకుళం నియోకజకవర్గంలో అయితే ఏకంగా పార్టీ జెండాలను తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. పార్టీ అధిష్టానం ఏకపక్షంగా వ్యవహరించడంపై కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబు నమ్మించి, మోసం చేశారని మండిపడుతున్నారు. రెండో జాబితా విడుదల సందర్భంగా శ్రీకాకుళం స్థానాన్ని బిజెపికి కేటాయించారంటూ ప్రచారం జరిగింది. దీంతో నియోజకవర్గ టిడిపి కేడర్‌ భగ్గుమంది. ఎంపీ రామ్మోహన్‌నాయుడు నివాసం వద్ద ఆందోళనకు సైతం దిగారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి టిక్కెట్‌ వచ్చేలా చేస్తానంటూ మాటవివ్వడంతో అప్పటికి శాంతించారు. టిక్కెట్‌ కచ్చితంగా వస్తుందని ధీమాగా ఉన్న గుండ అభిమానులు ఈ నెల 22న వెలువడిన మూడో జాబితాతో అనుకోని షాక్‌ తగిలింది. ఆమె స్థానంలో గొండు శంకర్‌కు టిక్కెట్‌ దక్కడంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. జాతీయ పార్టీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు తీరుపై ఆగ్రహాం వెళ్లగక్కారు. ఫొటోలు, పార్టీ జెండాలు, పోస్టర్లు తగలబెడుతూ కోపంతో ఊగిపోయారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలంటూ నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుని అందుకనుగుణంగా వెళ్లాలని గుండ కుటుంబం ఆలోచిస్తోంది. అరసవల్లిలోని గుండ నివాసం వద్ద ఆదివారం సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోను అదే పరిస్థితి నెలకొంది. పాతపట్నం టిక్కెట్‌ను మామిడి గోవిందరావుకు కేటాయించడంపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. కొత్తూరు మండలం మాతలలో సమావేశం నిర్వహించి పార్టీ కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్‌ కార్యచరణ ప్రకటన ఉంటుందని కలమట వెంకటరమణ అనుచరులు చెప్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే రెండుచోట్లా టిడిపికి ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టిడిపి డబ్బులకు టిక్కెట్లను అమ్ముకుందనే ఆరోపణలను మూటకట్టుకుంది. ఎన్నికల ఖర్చును పూర్తిగా ఎవరు పెట్టుకోగలిగితే వారికే అధిష్టానం టిక్కెట్లను కేటాయించిందనే చర్చ నడుస్తోంది. ఖర్చుకు వెనుకడుగు వేసిన వారిని పక్కన పెట్టిందని నాయకుల్లో చర్చల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్ధుల నుంచి డబ్బులు తీసుకుని శ్రీకాకుళం, పాతపట్నం టిక్కెట్లను అమ్ముకున్నారంటూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సైతం ఈ మరక అంటింది. ఎన్నికల్లో ఈ రెండు సీట్లు ఓడిపోతే దానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడే కారణమంటూ పార్టీ శ్రేణులు నిందిస్తున్నాయి. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టిక్కెట్ల రాక భంగపడ్డ మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర అవమానంతో రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను బట్టి ఫలానా వ్యక్తికి టిక్కెట్‌ ఇస్తున్నామని కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా ప్రకటించడంపై వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మీ నియోజకవర్గంలో ఎవరనైనా మారిస్తే మీకు ఫోన్‌ చేసి చెప్తానని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో చంద్రబాబు అన్నట్లు తెలిసింది. నమ్ముకున్న జనాన్ని మోసం చేసినట్లే సొంత పార్టీ నాయకులనూ బాబు ఇలా మోసం చేస్తారని అనుకోలేదని వారు గుండ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుంచి ఇదే అనుభవం ఎదురైంది. ఉదయం పది గంటలకు తాను ఫోన్‌ చేస్తే నీకే టిక్కెట్‌ అంటూ చెప్పి మోసం చేశారని కలమట మండిపడుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో కాస్తాకూస్తో ఊగిసలాటలో ఉన్నా పాతపట్నం నియోజకవర్గంలో మాత్రం కేడర్‌లో కొంత స్పష్టత కనిపిస్తోంది. తమ నేతకు టిక్కెట్‌ రాకపోవడానికి కింజరాపు కుటుంబమే కారణమంటూ కేడర్‌ ప్రతీకారానికి సిద్ధమవుతోంది. కార్యకర్తల అభిష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని పైకి చెప్తున్నా… ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ నిర్ణయించినట్లు తెలిసింది. శ్రీకాకుళం నియోజకరవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి టిక్కెట్‌ రాకపోవడానికి అచ్చెన్నాయుడే కారణమంటూ కేడర్‌ నిందిస్తోంది. గుండ కుటుంబాన్ని అణగదొక్కేందుకు ఒక పథకం ప్రకారం ఇలా చేశారని వారు చెప్తున్నారు. నియోజకవర్గంలో బలహీన అభ్యర్ధిని నిలబెట్టించడం ద్వారా ధర్మాన ప్రసాదరావు గెలుపునకు దోహదపడాలన్నది అచ్చెన్న వ్యూహమని వారు అంటున్నారు. గుండ కుటుంబానికి జరిగిన అన్యాయంపై తాడోపేడో తేల్చుకోవాలని కేడర్‌ భావిస్తోంది. ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని గుండ లక్ష్మీదేవిపై ఒత్తిడి చేస్తోంది. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో ఇద్దరు సీనియర్‌ మాజీ ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్లుగా బరిలో దిగితే దాని ప్రభావం ఎంపీ రామ్మోహన్‌ నాయుడుపై పడనుంది. అచ్చెన్నాయుడును దెబ్బతీసే అవకాశం లేకపోవడంతో ఆ నష్టం ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకి తగలనుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యే కేడర్‌, అభిమానులు, సానుభూతిపరులు ఎంపీ కాదని వేరే అభ్యర్థికి ఓటేస్తే టిడిపి ఎంపీ సీటును కోల్పోయే ప్రమాదముందనే ఆందోళన కేడర్‌లో కనిపిస్తోంది. దీంతో పాటు రెండు నియోజకవర్గాల్లోనూ టిడిపికి నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎచ్చెర్ల సీటు బిజెపికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ సీటునూ వదులుకోవాల్సిందేనని పలువురు టిడిపి నాయకులు లెక్కలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అభ్యర్థులను నిర్ణయించామని అధినేత చంద్రబాబు చెప్తుంటే… జిల్లాలో మాత్రం వేరే ప్రయోజనాలు కోసం పార్టీ పెద్దలు రాజకీయ క్రీడ ఆడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద బిజెపితో పొత్తు, అభ్యర్థుల మార్పుతో జిల్లాలో టిడిపి గట్టి దెబ్బే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

➡️