తనిఖీల్లో పట్టుబడితే లెక్క చెప్పాల్సిందే

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కోడ్‌

వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు (ఫైల్‌)

పత్రాలు లేని ఆర్థిక లావాదేవీలపైనా దృష్టి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కోడ్‌ అమలులోకి వచ్చిం ది. పోలీసు బలగలు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఘటనలు జరిగినా యంత్రాంగం కఠిన చర్యలు తప్పవు. ఎన్నికల కోడ్‌ అమలు సమయంలో పెద్దమొత్తంలో నగదు, బంగారం, తాయిలాలు అందించేందుకు క్రికెట్‌ కిట్లు, ఇతర బహుమతులు నియోజకవర్గ కేంద్రాలకు తరలించకుండా అడ్డుకట్ట వేసేపనిలో యంత్రాంగం నిమగమైంది. అయితే పెళ్లి, ఇతర శుభకార్యాలు, భూముల కొనుగోలు, అమ్మకాలు సమయంలో ఆదమరచి పెద్దమొత్తంలో డబ్బు తమతో పాటు తీసుకెళ్లినప్పుడు సరైన పత్రాలు చూపాల్సి వస్తుంది. రూ.50 వేలకు మించి నగదు పట్టుబడితే తప్పక ఆధారాలు చూపాల్సిందే.జిల్లాలో అంతర రాష్ట్ర సరిహద్దులు, అంతర జిల్లా సరహద్దుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేక తనిఖీ కేంద్రాలు (చెక్‌పోస్టు) ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్నీ తనిఖీలు చేస్తున్నారు. నగదు, బంగారు ఆభరణాలు, మద్యం రవాణా జరగకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అయితే జిల్లాలో అత్యంత పొడవైన జాతీయ రహదారి, తూర్పు నుంచి దక్షిణ సరిహద్దుల్లో ఒడిశా భూభాగం ఉండడం వల్ల నిత్యావసర సరకులు మొదలు నాటు సారా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు పెద్దఎత్తున రవాణా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్కడిక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 11 చెక్‌పోస్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో తనిఖీల్లో ఆధారాల్లేని నగదు, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి.ఇలా పాటించాలి…’అపరిచిత వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేసే అవకాశం ఇవ్వొద్దు. గత ఆరు నెలల్లో ఖాతాల్లో జమైన మొత్తాలకు మించి నగదు జమ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఖాతాలో జమైన మొత్తాలకు సంబంధించి అధికారుల్లో అనుమానం ఉంటే ఆధారాలు చూపేందుకు సిద్ధంగా ఉండాలి. అవకాశం ఉన్నంద వరకు ఇతరులకు ఖాతా సంఖ్య ను చెప్పకపోవడం మంచిది. వివాహాలు, శుభ కార్యాలు, అత్యవసర వైద్య ఖర్చులు, వ్యాపార చెల్లింపులు చేసేవారు తగిన ఆధారాలతోనే నగదు తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌ చెల్లింపుల వివరాలూ ఉం చుకోవడం ఉత్తమమని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం ఒక వ్యక్తి ఎన్నికల సందర్భంగా రూ. 50వేల వరకే తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అంతకంటే ఎక్కువ ఉంటే అందుకు సంబంధించి ఆధారాలు చూపాలి. అలాగే బ్యాంకులోని అనుమానాస్పద లావాదేవీలపైనా ప్రత్యేక నిఘా ఉంటుంది. ఒకవేళ ఖాతాల్లో నిర్ణీత నగదుకు మించి జమైతే సీజ్‌ చేసే అవకాశముంది. అభ్యర్థులు, ముఖ్య నాయకులు వారి బంధువుల ఖాతాల్లోని లావాదేవీలపైనా ప్రత్యేక నిఘా ఉంచుతామని జిల్లా యంత్రాగం చెపుతోంది. ఎన్నికల కోడ్‌ ప్రతిఒక్కరికీ వర్తిస్తుండటంతో సామాన్యులు సైతం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దక్షిణాధి రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న ఇచ్ఛాపురం మీదుగా ప్రతినిత్యం వేల సంఖ్యలో వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. బంగారం, వెండితో పాటు అనేక రకాలైన వస్తువులు ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. దీనికితోడు వివాహాలు, గృహప్రవేశాలు, ఇరత ఫంక్షన్ల సీజన్‌ కావడంతో బంగారం, వెండి, వస్తువులతో పాటు దుస్తులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టు సరైన వివరాలు లేకపోతే ఇబ్బందులు తప్పవు. వీటి కొనుగోలుకు తీసుకెళ్లే నగదు విషయంలోనూ జాగ్రత్తగా తీసుకోవాలని అధికారులు చెపుతున్నారు. కొనుగోలు తర్వాత బిల్లు తీసుకోవడం తప్పనిసరి. ముమ్మరంగా వాహనాల తనిఖీఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించేందుకు అనేక దారులు ఉన్నాయి. ఈ దారులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే మెళియాపుట్టి, పలాస, మందస, కంచిలి, ఇచ్ఛాపురం ప్రాంతాలు ఒడిశా సరిహద్దును ఆనుకుని ఉన్నాయి. ఈ ప్రాంతాలకు నాటు సారా యథేచ్ఛగా జిల్లాలోకి వచ్చి చేరుతుంది. అలాగే మద్యమూ అడ్డదారుల్లో తరలిస్తుంటారు. మరోవైపు రైలు మార్గాన అక్రమ మద్యం, గంజాయి రవాణాపై పోలీసుల నిఘా ఉంది. ఇటీవల పొందూరు, సోంపేట, సరుబుజ్జిలి, జి.సిగడాం మండలాల్లో వాహనాల్లో తరలిస్తున్న నగదు పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు.

 

➡️