తప్పుడు కేసులతో ప్రజాధనం దుర్వినియోగం

ఒక్క ఛాన్స్‌ అంటూ

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌

  • టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజా భవన్‌ కూల్చివేతతో ప్రారంభించిన విధ్వంసం రుషికొండ వరకు తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ విమర్శించారు. న్యాయస్థానాల్లో ఎన్నిసార్లు చీవాట్లు తిన్నా తప్పుడు కేసులతో ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు నిరాధారమైనవని ఒక్కొక్కటిగా రుజువవుతోందన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఇసుక కేసుల్లో ఇప్పటికే కోర్టులో జగన్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు నిజం గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. సొంత కుటుంబం నుంచి విమర్శలు వచ్చినా తట్టుకోలేక ఎదురుదాడికి దిగుతున్న వైసిపి శ్రేణులు… అల్లరిమూకల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై, నేడు సొంత చెల్లెలు షర్మిలపై జగన్‌, ఆయన పార్టీ నాయకులు అనుసరిస్తున్న తీరు మహిళలు సిగ్గుపడే రీతిలో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి మహిళల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. సొంత పార్టీలోనే అసమ్మతి రగులుతోందని, అందుకే వేదికలపై వైనాట్‌ 175 అని చెప్పుకునే జగన్‌… మీడియా ముందు ఓడిపోయినా పర్వాలేదని అంటున్నారని తెలిపారు.

 

➡️