దళారులను నమ్మొద్దు

రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... రైతులు మధ్యవర్తులు, దళారులను నమ్మొద్దని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం

  • ప్రతి గింజా ప్రభుత్వం కొంటుంది
  • శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి – బూర్జ

రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని… రైతులు మధ్యవర్తులు, దళారులను నమ్మొద్దని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జ ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ-క్రాప్‌ చేసుకున్న ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తుందని చెప్పారు. దళారులు, మధ్యవర్తులు, మిల్లర్ల చేతిలో రైతులు నష్టపోకుండా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నేరుగా విక్రయించాలన్నారు. రైతులు పండించిన పంటను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరురక్షిత మంచి నీటి పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్‌ సీతారాం అన్నారు. మండలంలోని అన్నంపేటలో రూ.25 లక్షల అంచనాలతో నిర్మించ తలపెట్టిన రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. రూ.తొమ్మిది లక్షలతో జగనన్న కాలనీలో ఐదుగురు లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. మండలంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెప్పారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా ప్రాథమిక వైద్యం ప్రజలకు అందుబాటులో లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి బి.రామా రావు, ఎంపిపి ప్రతినిధి కె.నాగేశ్వరరావు, వైస్‌ ఎంపిపి బుడుమూరు సూర్యారావు, వైసిపి మండల అధ్యక్షులు కె.గోవిందరావు, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ జల్లు బలరాం నాయుడు, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు జి.రాంబాబు, స్థానిక నాయకులు కె.శంకరరావు, జి.సుధాకర్‌, మామిడి ఆదినారాయణ, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

 

➡️