దాహం కేకలు తప్పేనా?

గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 4037 గ్రామాలు ఉండగా, కేవలం 1518 గ్రామాలకే

జిసిగడాం మండలం బురిడి కంచరాంలో మూలకు చేరిన తాగునీటి పథకం

2519 గ్రామాలకు పాక్షికంగానే తాగునీరు

మరమ్మతులకు గురైన పలు పథకాలు

చేతి పంపులదీ అదే పరిస్థితి

నీటి ఎద్దడి నివారణకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

జిల్లాలో ఎండ క్రమేణా పెరుగుతోంది. సాధారణ రోజుల్లోనే పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉత్పనమవుతున్న నేపథ్యంతో వేసవి ప్రారంభం కావడంతో నీటి సమస్యలు మొదలయ్యాయి. జిల్లాలో సగానికి పైగా గ్రామాల్లో పాక్షికంగానే తాగు నీరందులోంది. సమగ్ర, రక్షిత, సింగిల్‌ విలేజ్‌ స్కీంలు చాలా చోట్ల మరమ్మతులకు గురయ్యాయి. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఏటా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేవారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా తాగునీటి కనెక్షన్లు ఇస్తున్నామనే పేరుతో ప్రభుత్వం రెండేళ్లుగా సరఫరా నిలిపేసింది. వేసవి సీజన్‌ ప్రారంభానికి ముందే ఏయే గ్రామాల్లో నీటిఎద్దడి తలెత్తుందో గుర్తించి అందుకనుగుణంగా గతంలో యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేసే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం గ్రామీణ నీటి సరఫరా సబ్‌ డివిజన్ల నుంచి జిల్లాకు ప్రతిపాదనలు చేరాయి. దీంతో ఈ ఏడాది పల్లె వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 4037 గ్రామాలు ఉండగా, కేవలం 1518 గ్రామాలకే తాగునీరందుతోంది. 2519 గ్రామాలకు పాక్షికంగానే తాగునీటి సరఫరా జరుగుతోంది. జిల్లాలో 38 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు ఉండగా, ఏ ఒక్క పథకమూ సక్రమంగా పని చేయడం లేదు. జిల్లాలోని 918 రక్షిత మంచినీటి పధకాల పరిస్థితి అలానే ఉంది. జిల్లాలో 15,848 చేతి పంపులు ఉన్నా, ఎప్పటికప్పుడు మొరాయిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రోజుకి 70 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా, 55 లీటర్ల నీటిని మాత్రమే అందించగలుగుతున్నారు. ఆ మేరకు తాగునీటిని అందిస్తున్న గ్రామాలు 1521 మాత్రమే ఉన్నాయి. పాక్షికంగా తాగునీరందుతున్న గ్రామాలు 2497 గ్రామాలున్నాయి. మరమ్మతులకు గురైన పలు తాగునీటి పథకాలుజిల్లాలో 192 చిన్న రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. వాటిలో ఏడు పని చేయడం లేదు. అదేవిధంగా 904 సింగిల్‌ విలేజ్‌ స్కీంలు ఉండగా, వాటిలో 65 పథకాలు పనిచేయడం లేదు. జిల్లాలో 30 సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు (సిపిడబ్ల్యూఎస్‌) ఉన్నాయి. వాటిలోనూ చిన్నపాటి మరమ్మతులు ఉన్నాయి. చేతి పంపులు, డైరక్ట్‌ పంపు పథకాల్లోనూ మరమ్మతులకు గురయ్యాయి. జిల్లాలో చేతి పంపులు, డైరెక్ట్‌ పంపింగ్‌ పథకాలు కలిపి మొత్తం 13,885 ఉన్నాయి. వాటిలో తాగునీటి యోగ్యంగా 12,808 చేతి పంపులు ఉండగా, 1077 పంపుల్లో నీరు తాగేందుకు పనికిరానిదిగా అధికారులు గుర్తించారు. తాగటానికి ఉపయోగేపడే వాటిలో 271 పంపులు పనిచేయడం లేదు. తాగటానికి యోగ్యం కాని వాటిలో 37 పథకాలు మూలకు చేరాయి.మండలాల్లో పరిస్థితి ఇలా…జిల్లాలో మొత్తం 65 సింగిల్‌ విలేజ్‌ స్కీంలు మరమ్మతులకు గురవ్వగా అందులో హిరమండలం మండలంలో అత్యధికంగా 25 పథకాలు మూలకు చేరాయి. ఎల్‌ఎన్‌పేటలో 20 పథకాలు జలుమూరులో 11 పథకాలు పాడయ్యాయి. చిన్న రక్షిత తాగునీటి పధకాలకు సంబంధించి మందసలో మూడు, పలాసలో రెండు పథకాలు పాడయ్యాయి. తాగునీటికి యోగ్యం ఉన్న చేతి పంపుల్లో 271 చేతి పంపులు మరమ్మతులకు గురయ్యాయి. వీటిలో హిరమండలం మండలంలో అత్యధికంగా 35 పంపులు పాడయ్యాయి. మందసలో 27, రణస్థలంలో 25, ఎచ్చెర్లలో 21 పంపులు మూలకు చేరాయి. నిధుల కొరత తీరేనా?తాగునీటి పథకాలకు కొంతమేర నిధుల కొరత ఉన్నట్లు కనిపిస్తోంది. మరమ్మతులకు గురైన 65 సింగిల్‌ విలేజ్‌ స్కీంల పునరుద్ధరణకు రూ.18.80 లక్షలు అవసరం కాగా, పంచాయతీల ఖాతాల్లో రూ.6.50 లక్షలు మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో మరమ్మతుల కోసం మరో 12.30 లక్షలను సమకూర్చాల్సి ఉంది. జిల్లాలో ఉన్న సమగ్ర మంచి రక్షిత తాగునీటి పథకాలకు రూ.14.50 లక్షలు అవసరం ఉంది. మొత్తం మీద అన్ని పథకాలకు రూ.26.80 లక్షలు కావాల్సి ఉంది.ప్రతిపాదనలు రూపొందించడంలో జాప్యంవేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో సాధారణ రోజుల్లోనే ఏయే ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉంటుందో ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఏటా వేసవిలో తాగు నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంటే పరిపాలన అనుమతులు, సత్వరం నిధుల విడుదలకు ఆస్కారముండేది. గ్రామీణ నీటి సరఫరా శాఖకు సబ్‌ డివిజన్ల వారిగా ఇప్పుడు ప్రతిపాదనలు వచ్చాయి. వాటికి కలెక్టర్‌ ఆమోదం తెలపడం, పరిపాలనా అనుమతులు జారీ చేయడం వంటి ప్రక్రియలు పూర్తయితే గాని పనులు మొదలు పెట్టే అవకాశం లేదు. మొత్తం మీద వేసవి నేపథ్యంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 

➡️