దొంగ హామీలతో వస్తారు

రానున్న ఎన్నికల కాలంలో చంద్రబాబు అండ్‌

నమూనా చెక్కును అందజేస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు
  • జిల్లాలో 3,23,434 మందికి రూ.94.52 కోట్ల పెన్షన్లు
  • రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, రూరల్‌

రానున్న ఎన్నికల కాలంలో చంద్రబాబు అండ్‌ కో దొంగ హామీలతో వస్తారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఇచ్చిన హామీలు అధికారంలోకొచ్చాక అమలు చేయని ఘనత చంద్రబాబుకే దక్కిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. నగరంలోని బాపూజీ కళామందిర్‌లో పెన్షన్‌ కానుక పెంపు, శ్రీకాకుళం రూరల్‌ మండలం చింతాడలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో వైసిపి నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. అర్హతే ప్రామాణికంగా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. టిడిపి హయాంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే గానీ పథకాలు అందేవి కావని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వంలో అర్హత ఉంటే పథకాలు వాటంతట అవే ప్రజల ఇంటికి వస్తున్నాయని చెప్పారు. జిల్లాలో 3,23,434 మందికి రూ.94.52 కోట్ల మేర పెన్షన్లు అందజేస్తున్నట్లు వివరించారు. తెల్లారేసరికి వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్‌ అందిస్తున్నట్లు చెప్పారు. బూత్‌ కోఆర్డినేటర్లు శ్రద్ధతో పనిచేయాలిఎన్నికల వేళ ప్రతి బూత్‌ కో-ఆర్డినేటర్‌ శ్రద్ధతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కొన్ని మీడియా సంస్థలు స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని, అవి అనుకునే పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందుతున్నవి వాటి ఖాతాల్లోకి వెళ్తాయని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, పేదలకు నిర్మించిన జగనన్న కాలనీలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మరోసారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు వైసిపి శ్రేణులు ఏకతాటిపై నిలిచి పనిచేయాలని పిలుపునిచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ మాట్లాడుతూ ఈనెల నుంచి పెన్షన్‌ను రూ.2,750 నుంచి రూ.మూడు వేలకు ప్రభుత్వం పెంచిందని తెలిపారు. జిల్లాలో కొత్తగా 9,619 పెన్షన్లు మంజూరు చేసి, వారికి ఈనెల నుంచే రూ.మూడు వేలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, కళింగ వైశ్య, పొందర కార్పొరేషన్ల చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, హైమావతి, సుడా డైరెక్టర్‌ కె.ఆశాలత, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, వైసిపి రూరల్‌ మండల అధ్యక్షులు చిట్టి జనార్థనరావు, ఎఎంసి చైర్మన్‌ మూకళ్ల తాతబాబు, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️