ధాన్యం కొను’గోల’

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి

పలాస : కొనుగోలు లేక కళ్లాల్లో ఉన్న ధాన్యం

  • జిల్లాలో 5 మండలాల్లో ప్రారంభం కాని కొనుగోలు
  • ఇప్పటివరకు కొన్నది 46,378 మెట్రిక్‌ టన్నులు

బ్యాంకు గ్యారంటీలు, సాంకేతిక సమస్యలు చివరి గింజ వరకు ధాన్యం కొంటాం. దళారుల ప్రమేయం లేకుండా చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఇవీ ప్రజాప్రతినిధులు, అధికారులు ధాన్యం కొనుగోలు ప్రారంభంలో చెప్పే మాటలు. కొనుగోలు విషయానికి వచ్చేసరికి పాత కథే పునరావృతమవుతోంది. ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారే తప్ప పని జరగడం లేదు. డిసెంబరు మూడో వారంలోకి ప్రవేశించినా, ధాన్యం కొనుగోలు జోరందుకోలేదు. జిల్లాలో నేటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ధాన్యం సిద్ధంగా ఉన్నా కొనుగోలు చేయకపోవడంతో, రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. సాంకేతిక సమస్యలు, పూర్తిస్థాయిలో సిబ్బంది నియమించకపోవడం, ధాన్యం నాణ్యంగా లేకపోవడంతో మిల్లర్లు తీసుకునేందుకు నిరాకరించడం వంటి సమస్యలతో ధాన్యం కొనుగోలు ముందుకు సాగడం లేదు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, పలాస

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల క్రాపింగ్‌ చేశారు. 3,34,330 ఎకరాలకు ఇకెవైసి పూర్తయింది. ఈ సంవత్సరం 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం వరికి సాధారణ రకానికి రూ.2,183, గ్రేడ్‌ ‘ఎ’ రకానికి రూ.2,203 మద్దతు ధర ప్రకటించింది. ధాన్యం కొనుగోలుకు అధికారులు జిల్లావ్యాప్తంగా 390 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. రెండు వేలు పైబడి ధాన్యం సేకరించే అవకాశం ఉన్న కేంద్రాలను ఎ-కేటగిరీగా, వెయ్యి నుంచి రెండు వేల టన్నుల్లోపు వరకు కొనుగోలు చేసే వాటిని బి-కేటగిరీగా విభజించారు. వెయ్యి టన్నుల కంటే తక్కువ ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉన్న వాటిని సి-కేటగిరీగా నిర్ణయించారు. జిల్లాలో ఎ-కేటగిరీలో 182, బి-కేటగిరీలో 176, సి-కేటగిరీలో 32 కేంద్రాలు ఉన్నాయి.కొనుగోలు చేయకపోవడంపై రైతుల ఆగ్రహంధాన్యం కొనుగోలుకు లక్ష్యం పెట్టుకోలేదంటూ అధికారులు చెప్తున్నా, కేంద్రాలకు నిర్దేశించిన మేరకే కొంటున్నారు. మిల్లులకు ఇచ్చిన ధాన్యం మేరకు మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటున్నారు. బ్యాంకు గ్యారంటీలు పూర్తి కావడంతో, ఆర్‌బికె సిబ్బంది తర్వాత వచ్చిన వాటిని వెనక్కి పంపిస్తున్నారు. ఎల్‌ఎన్‌పేట మండలం రావిచంద్రిలో రైతులకు ఇదే సమస్య ఎదురైంది. రైతులు కోపోద్రిక్తులు కావడం, బత్తిలి-అలికాం రోడ్డుపై ధాన్యం ట్రాక్టర్లతో నిరసన దిగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.ధాన్యం కొనుగోలు పరిస్థితి ఇలా…జిల్లాలో గ్రేడ్‌-ఎ, సాధారణ రకం ధాన్యం కలిపి మొత్తం 46,378 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలుకు 390 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పినా, ఇప్పటివరకు 313 కేంద్రాలే తెరుచుకున్నాయి. పలాసలో ఒకే ఒక్క కేంద్రాన్ని తెరిచి 17.88 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. సోంపేటలో మూడు కేంద్రాల ద్వారా 22.96 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. జి.సిగడాం మండలంలో రెండు కేంద్రాలను ప్రారంభించి, ఇప్పటివరకు 61.20 టన్నులను కొనుగోలు చేశారు. మందసలో తొమ్మిది కేంద్రాల ద్వారా 166.44 మెట్రిక్‌ టన్నులను కొన్నారు. ఆమదాలవలసలో ఏడు కేంద్రాల ద్వారా 221.16 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేశారు. కొత్తూరు మండలంలో 25 కేంద్రాలను తెరిచి 2,271.84 మెట్రిక్‌ టన్నులను కొన్నారు.నత్తనడకన కొనుగోళ్లుధాన్యం కొనుగోలుకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 22 మండలాల్లో మాత్రమే కొనుగోలు చేశారు. 313 కేంద్రాలు తెరుచుకున్నాయి. ఇప్పటివరకు 46,378 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో గ్రేడ్‌-ఎ రకం 23.36 మెట్రిక్‌ టన్నులు కాగా, సాధారణ రకం ధాన్యం 46,378 మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేశారు. బ్యాంకు గ్యారంటీలు, సాంకేతిక సమస్యలు వంటి సమస్యలతో ధాన్యం కొనుగోలు సాఫీగా సాగడం లేదు. రైతుల నుంచి వచ్చిన ధాన్యం వివరాలను రైతుభరోసా కేంద్రాల సిబ్బంది నమోదు చేస్తున్న సందర్భంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని మిల్లులకు భారీగా లోడులు వెళ్తుంటే, మరికొన్నింటికి స్వల్ప పరిమాణంలో వెళ్తున్నాయి.

 

➡️