నాన్‌ లోకల్‌ నాయకులను నమ్మరు

నాన్‌ లోకల్‌ నాయకులు చంద్రబాబు

ట్యాబ్‌లను అందిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

  • రాష్ట్రంలో స్థిర నివాసం లేని వారు చంద్రబాబు, పవన్‌
  • సమర్థ నాయకుడు జగన్‌ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు
  • సిఎం జన్మదిన వేడుకల్లో మంత్రి ధర్మాన

ప్రజాశక్తి – గార, శ్రీకాకుళం అర్బన్‌

నాన్‌ లోకల్‌ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ను రాష్ట్ర ప్రజలు నమ్మరని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద, శ్రీకాకుళం నగరంలోని సిఎం జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌కు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి పదేళ్లవుతున్నా హైదరాబాద్‌ను వదిలి చంద్రబాబు, పవన్‌ ఎందుకు రావడం లేదని, రాష్ట్రంలో స్థిర నివాసం ఎందుకు ఏర్పరుచుకోవడం లేదని ప్రశ్నించారు. యువగళం ముగింపు సభలో మాట్లాడిన వారెవరికీ రాష్ట్రంలో స్థిర నివాసం అంటూ లేదన్నారు. పొరుగు రాష్ట్రం నాయకులంతా ఇటుగా వచ్చి తమకు ఓటేయమంటున్నారని, ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలని కోరారు. సిఎం జగన్‌ అందరి మెప్పు పొందిన సమర్థ నాయకుడు అని కొనియాడారు. అన్ని వర్గాలకూ మంచి చేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని చెప్పారు. పేదలకు మంచి జరగకూడదని విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న స్టడీ మెటీరియల్‌ అందుకుని పోటీ ప్రపంచంలో ఆశించిన ఫలితాలు సాధించవచ్చన్నారు. పిల్లలకు ఇస్తున్న ట్యాబ్‌ల్లో అవసరమైన వాటినే ఉంచి, మిగిలిన వాటిని బ్రౌజ్‌ చేయకుండా లాక్‌ చేసి ఇస్తున్నట్లు చెప్పారు. ఇది తెలిసీ పచ్చ మీడియా తప్పుడు రాతలు రాస్తోందన్నారు. ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థికి అవసరమైన విజ్ఞాన విషయాలు అందించేందుకు ట్యాబ్‌లు అందిస్తున్నామన్నారు. విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలగిపోతాయన్నారు. కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్‌ అంధవరపు సూరిబాబు, డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు రఘురాం, వైసిపి గార, రూరల్‌ మండల అధ్యక్షులు పీస గోపి, చిట్టి జనార్థనరావు, జెడ్‌పిటిసి రుప్ప దివ్య, మార్పు ధర్మారావు, నాటక అకాడమీ డైరెక్టర్‌ ముంజేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️