‘నీట్‌’లో పెద్దఎత్తున అక్రమాలు

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

* పరీక్షను మళ్లీ నిర్వహించాలి

  • ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.హరీష్‌
  • శ్రీకాకుళంలో విద్యార్థుల ర్యాలీ

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ప్రతినిధివైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌ పరీక్షలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.చందు, బి.హరీష్‌ విమర్శించారు. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యాన విద్యార్థులు నగరంలోని అంబేద్కర్‌ జంక్షన్‌ నుంచి డే అండ్‌ నైట్‌ కూడలి వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో పెద్దఎత్తున అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నా, వాటిపై విచారణ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాలని చూస్తోందన్నారు. నీట్‌ అక్రమాలపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా, న్యాయస్థానాలను ఆశ్రయించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు కేంద్రానికి, నీట్‌ను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)కు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ స్పందించి రెండుచోట్ల అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించామని అంగీకరించారని తెలిపారు. ఎన్‌టిఎను మెరుగుపర్చాల్సి ఉందని చెప్పుకొచ్చారు తప్ప దీనిపై విచారణ చేయిస్తామని గానీ, అభ్యర్థులకు న్యాయం చేస్తామని గానీ చెప్పలేదన్నారు. నీట్‌లో అక్రమాలను సాధారణంగా చోటుచేసుకున్న చిన్న తప్పులన్నట్లు పేర్కొన్నారు తప్ప కనీసం పశ్చాత్తాపం చెందడం లేదన్నారు. నీట్‌ స్కామ్‌ను కేంద్ర ప్రభుత్వం తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. హర్యానాలో 67 మంది అభ్యర్థులకు 720 మార్కులు వచ్చాయని, అందులో ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు ఉన్నారని తెలిపారు. పరీక్షలను నిర్వహించిన ఎన్‌టిఎ పనితీరు లోపభూయిష్టంగా తయారైందని పేపర్‌ లీక్‌, ఇతర అవకతవకలు దీన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. నెట్‌ (నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌)లో చోటుచేసుకున్న అవకతవకలపై స్పందించి యుజిసి దాన్ని వెంటనే రద్దు చేసిందని, నీట్‌ పరీక్షను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నీట్‌ అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, నేరస్తులను కఠినంగా శిక్షించి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.సంతోష్‌, కమిటీ సభ్యులు భూపతి, పవిత్ర, మోహిని, సాయి తదితరులు పాల్గొన్నారు.

➡️