నేల విడిచి సాము

జిల్లా రాజకీయాల్లో విచిత్రమైన మార్పులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లా రాజకీయాల్లో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌, టిక్కెట్ల కేటాయింపు తర్వాత ప్రధాన రాజకీయ పార్టీల్లో రెండు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సిట్టింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత, గ్రూపుల పోరుతో సతమతమైన వైసిపి క్రమేణా సానుకూల పరిస్థితుల దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో ఒకట్రెండు చోట్ల మినహా అన్ని సీట్లను గెలిచేస్తామని ఊపు మీద ఉన్న టిడిపి ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇదంతా టిడిపి చేసుకున్న స్వయంకృతాపరాధమే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పొత్తులు, టిక్కెట్ల కేటాయింపులో క్షేత్ర స్థాయి పరిస్థితులను బేరీజు వేయలేకపోవడం పార్టీకి ఈ రకమైన స్థితి ఎదురైందనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రధానంగా టిక్కెట్ల కేటాయింపులో చేసిన తప్పిదాలు ఓటమిని కోరి కొని తెచ్చుకున్నట్లుగా ఉందని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. పాతపట్నం, శ్రీకాకుళం స్థానాల్లో పార్టీ ఇన్‌ఛార్జిగాలు ఉన్న సీనియర్లను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వడాన్ని కార్యకర్తలు జీర్జించుకోలేకపోతున్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో అసమ్మతిని రాజేసి చివరకు అసమ్మతి నాయకులకే సీట్లను కట్టబెట్టారన్న విమర్శలను జిల్లా టిడిపి పెద్దలు మూటకట్టుకున్నారు. సీనియర్‌ నేత కిమిడి కళా వెంకటరావును ఎచ్చెర్ల నుంచి విజయనగరం జిల్లా చీపురుపల్లికి బదిలీ చేయడంపై నియోజకవర్గ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ పదవులకు సైతం రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఎచ్చెర్లలో ఈ నెల 30న సమావేశమై తర్వాత మనసు మార్చుకుని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్చడంలో టిడిపి ఏకపక్షంగా వ్యవహరించిందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందు మిమ్మల్ని సంప్రదిస్తామని చెప్పిన మాట మాత్రంగానైనా చంద్రబాబు తమతో చెప్పలేదని నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు అవమానభారంగా భావిస్తున్నారు. శ్రీకాకుళం, పాతపట్నంలో కేడర్‌ అంతా ఇన్‌ఛార్జీల వెంట ఉండగా కొత్త అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. పైగా అసమ్మతి నాయకులకే సీట్లు కేటాయించడంపై గుండ, కలమట వర్గీయులు మండిపడతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలోనూ ఆత్మీయ సమావేశాల పేరుతో కార్యకర్తలతో సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ తమ మద్దతుదారులు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీ అధిష్టానం ఏ సమయంలోనైనా తన నిర్ణయం మార్చుకోవచ్చన్న ఆశతో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. అభ్యర్ధుల ప్రకటనకు సంబంధించి ఇదే ఫైనల్‌ అయితే మాత్రం నిర్ణయాలు వేరే రకంగా ఉండొచ్చన్న చర్చ కేడర్‌లో నడుస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ కుటుంబం ఇండిపెండెం ట్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా లేకున్నా… పాతపట్నంలో మాత్రం కలమట వెంకటరమణ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండుచోట్ల ఇన్‌ఛార్జీలు ఇండిపెండెంట్లుగా పోటీ చేసినా తటస్థంగా ఉన్నా పార్టీకీ నష్టం కలిగే పరిస్థితి నెలకొంది. ఎచ్చెర్ల టిక్కెట్‌ను బిజెపికి కేటాయించడం, సీనియర్‌ నేత కిమిడి కళా వెంకటరావును చీపురుపల్లికి పంపడంతో పార్టీ కేడర్‌ జీర్ణించుకోలేకపోతోంది. ఇక్కడ బిజెపి అభ్యర్థికి ఎంత మేరకు సహకరిస్తారనేది చూడాల్సి ఉంది. టిడిపి టిక్కెట్ల ప్రకటనకు ముందు ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో వైసిపికి గడ్డు పరిస్థితి ఉండేది. సిటింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇరువురిని మార్చాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఆ రెండుచోట్ల అభ్యర్థులను మార్చకపోతే ఓడిస్తామంటూ ప్రకటనలు సైతం చేశారు. పార్టీ అధిష్టానం మాత్రం ఎటువంటి మార్పులు చేయకుండా వారికే మళ్లీ టిక్కెట్లు కేటాయించింది. టిక్కెట్ల కేటాయింపు తర్వాత విచిత్రంగా అసమ్మతి నాయకులెవరూ బయటకు రాలేదు. ఇదే సమయంలో అంతా బాగుందని భావించిన టిడిపి, దాని మిత్ర పక్షం బిజెపికి అసమ్మతి జ్వాలలు తాకాయి. టిక్కెట్లు కేటాయించడంలో టిడిపి ఏకపక్షంగా వ్యవహరించిన తీరే దీనికి కారణమనే వాదన వినిపిస్తోంది. పలు జాతీయ సర్వేల్లో టిడిపికి మెజార్టీ సీట్లు వస్తాయనే అంచనాలతో టిడిపి గెలుపు భ్రమల్లో తేలియాడుతోంది. నేల విడిచి సాము చేస్తోంది. అభ్యర్థి ఎవరనేది కాదని, పార్టీ బట్టి ఓటేస్తారని భావిస్తునట్లుగా కనిపిస్తోంది. ఈ కారణం చేతనే సీనియర్‌ నేతలను కాదని కొత్త వారితో ప్రయోగాలకు దిగిందనే చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడంలో టిడిపి విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలను ఖరారు చేయటానికి ఆ పార్టీ ఐవిఆర్‌ఎస్‌ సర్వేనే నమ్ముకుంది. పాతపట్నం, శ్రీకాకుళం అభ్యర్థుల ఎంపిక కోసం మూడు నాలుగు పర్యాయాలు సర్వే కోసం ఫోన్ల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంది. జనంతో పాటు వైసిపి కేడర్‌కూ ఆప్షన్లు అడగడంతో వారు మాత్రం టిడిపి నుంచి ఎవరు పోటీ చేస్తే తమ నేత గెలవగలరో గుర్తించి, వారికే ప్రాధాన్యం ఇచ్చారు. అదే సర్వే ఆధారంగా టిడిపి తన అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు రేగడానికి కారణమైందన్న చర్చ నియోజకవర్గాల్లో సాగుతోంది. మరికొద్ది వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపుల పోరు, కేడర్‌లో అసమ్మతి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని కేడర్‌ ఆందోళన చెందుతోంది. పరిస్థితులను చక్కదిద్దకపోతే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు అంటున్నారు. మరికొద్ది వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్టానం ఏం చర్యలు తీసుకోబోతోందనే వేచిచూడాల్సి ఉంది.

➡️