న్యాయవాదుల సంక్షేమానికి కృషి

రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తోందని

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జెసి నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. లా నేస్తం ఆరో విడత నిధులను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు సోమవారం జమ చేశారు. కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌ విధానంలో పాల్గొన్న జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ మాట్లాడుతూ లా పట్టా తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో అర్హులైన 58 మంది జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.ఐదు వేలు చొప్పున ఆరు నెలలకు రూ.30 వేలు చొప్పున జమ చేసినట్లు తెలిపారు. 58 మంది అర్హులకు రూ.17.40 లక్షలు జమ చేసినట్లు చెప్పారు. న్యాయవాదిగా వృత్తిలో రాణించడానికి ఈ ఆర్థికసాయం ఎంతో దోహదపడుతుందన్నారు. సమాజంలో న్యాయవాద వృత్తికి గౌరవప్రదమైన స్థానం ఉందని, యువ న్యాయవాదులు వృత్తిపై గౌరవాన్ని పెంచడానికి మరింత నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళింగవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, బిసి సంక్షేమ అధికారి అనురాధ, పలువురు అధికారులు, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

 

➡️