‘పంచతంత్ర’తో ఉత్తీర్ణత శాతం పెంపు

పదో తరగతి, ఇంటర్‌

వమరవల్లి డైట్‌ కళాశాలలో సైన్స్‌ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న శ్రీనివాసరావు

  • సమగ్ర శిక్ష ఎస్‌పిడి బి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – రణస్థలం, లావేరు, గార

పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు వంద రోజుల కార్యాచరణలో భాగంగా సమగ్ర శిక్ష రూపొందించిన ‘పంచతంత్ర’ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు దోహదపడుతుందని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. రణస్థలం, లావేరు మండలాల్లోని కెజిబివిలు, గార మండలంలోని వమరవల్లి డైట్‌ కళాశాలను మంగళవారం సందర్శించారు. రణస్థలం కెజిబివిలో యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్‌, ఆర్ట్‌, క్రాప్ట్‌ పరికరాలతో కూడిన ‘కాస్ట్‌మేకర్‌ స్పేస్‌’ సైన్స్‌ ప్రయోగశాలలను ప్రారంభించారు. వమరవల్లి డైట్‌ కళాశాలలో రీహేబిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (న్యూఢిల్లీ) ఆధ్వర్యాన ప్రత్యేక ఉపాధ్యాయులకు వృత్తిపరమైన, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వికలాంగ విద్యార్థులకు బోధనా విధానం, వారికి సమగ్ర శిక్ష కల్పించే సౌకర్యాలు తదితర అంశాలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ఇన్‌క్లూజివ్‌ ఆంధ్రప్రదేశ్‌-2025’ కార్యక్రమంలో భాగంగా వికలాంగ విద్యార్థులకు అందజేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఇన్‌స్టాల్‌ చేసిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సాధారణ విద్యార్థులతో పాటు శిక్షణ, విద్యా కార్యక్రమాలు అందించడం ద్వారా అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించాలని సూచించారు. డైట్‌ కళాశాలలోనే అమెరికన్‌ ఇండియన్‌ ఫౌండేషన్‌ సంస్థ ఏర్పాటుచేసిన ‘స్టెమ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ లెర్నింగ్‌ సెంటర్‌’ లో టీచర్‌ కార్నర్‌, స్టూడెంట్‌ ల్యాబ్‌ ప్రారంభించి, డైట్‌ గ్రంథాలయాన్ని, ప్రయోగశాలలను పరిశీలించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా అదనపు పథక సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌.జయప్రకాష్‌, డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తిరుమల చైతన్య, యూనిసెఫ్‌ ప్రతినిధి టి.సుదర్శన్‌, విజ్ఞానాశ్రమ్‌ ప్రతినిధి వెంకటేష్‌, సుమిత్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️