పకడ్బందీగా ‘మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండెక్ట్‌’

సాధారణ ఎన్నికల దృష్ట్యా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ను

కొత్తూరు : పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, ఆమదాలవలస

సాధారణ ఎన్నికల దృష్ట్యా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ను పకడ్బందీగా, పటిష్టంగా అమలు చేయడంపై దృష్టి సారించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. పర్యటనలో భాగంగా కొత్తూరు నియోజకవర్గ ఆర్‌ఒతో కలసి కర్లెమ్మ అంతర్‌ జిల్లా చెక్‌పోస్టును, హిరమండలం, ఎల్‌ఎన్‌పేటలో పోలింగ్‌ స్టేషన్‌ సందర్శించి ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. అలాగే ఆమదాలవలస మండలం కృష్ణాపురం వద్ద ఎఫ్‌ఎస్‌టి బృందాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 16 నుంచి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌ అమల్లోకి వచ్చిందని అన్నారు. ఏప్రిల్‌ 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని అన్నారు. అనంతరం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారని తెలిపారు. షెడ్యూల్‌ విడుదల నుంచి నోటిఫికేషన్‌ వరకు మధ్యనున్న సమయంలో ఎంసిసి అమలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎంసిసి సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ భవనాల్లో పోస్టర్లు, వాల్‌ రైటింగ్స్‌, బ్యానర్లు, హోర్డింగ్‌లు అన్ని మొదటి 24, 48 గంటల్లోనే తొలగించామని అన్నారు. జిల్లాలో ఎంసిసి అమలుపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇవిఎంల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ పూర్తి చేసి సిద్ధంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ఆర్‌ఒల హెడ్‌ క్వార్టర్లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలూ అవి పని చేస్తాయన్నారు. ఎంసిసికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీ విజిల్‌ యాప్‌ నుంచి వచ్చిన ఫిర్యాదులు వంద నిమిషాలలోపు పరిష్కరిస్తామని అన్నారు. 1950 టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు ఇచ్చినా 24 గంటల లోపు విచారణ చేసి పరిష్కరిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని, వాలంటీర్లు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, కొందరిని తొలగించామని స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని జిఒ విడుదల చేశామన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఎఫ్‌ఎస్‌టీలు, ఎంసిసి, విఎస్‌టి టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మద్యం, డబ్బు, ఇతర వస్తువుల అక్రమ రవాణా దృష్టిసారించామన్నారు. జిల్లాలో పకడ్బందీగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈయన వెంట తహశీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️