పక్కాగా పొగాకు ఉత్పత్తుల నిషేధం అమలు

జిల్లాలో పొగాకు ఉత్పత్తుల నిషేధాన్ని

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

జిల్లాలో పొగాకు ఉత్పత్తుల నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఎఎస్‌పిలు జె.తిప్పేస్వామి, టి.పి విఠలేశ్వర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంబంధ్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ వారి సహకారంతో జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులకు మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కాట్పా చట్టంలోని సెక్షన్‌-4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారు, విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా రాష్ట్రంలో ఏటా సుమారు 48 వేల మరణాలు సంభవిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. జువైనల్‌ చట్టంలోని సెక్షన్‌ 77 ప్రకారం ఎవరైనా మత్తు కలిగించే పదార్థాలు పిల్లలకు ఇస్తే వారికి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా కూడా విధించబడుతుందని తెలిపారు. పిల్లలను పొగాకు ఉత్పత్తులకు అలవాటు కాకుండా నిరోధించడం మన కర్తవ్యమన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ‘నో స్మోకింగ్‌’ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ శిక్షణా తరగతులు పోలీసు అధికారులకు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి దోహదపడుతుందన్నారు. జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖ అధికారి అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలో 13 నుంచి 15 ఏళ్ల వయసు వారిలో 33.6 శాతం మంది పొగాకు వినియోగదారులుగా ఉన్నారని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి వైద్యారోగ్య, విద్యాశాఖలు అన్ని జిల్లాల్లో పొగాకు రహిత విద్యాసంస్థ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. అనంతరం పొగాకు వ్యతిరేకంగా పోరాడతామని పోలీసు అధికారులు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో డిఎస్‌పిలు వై.శృతి, ఎస్‌.వాసుదేవ్‌, విజరు కుమార్‌, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, పోలీసు, వైద్యాధికారులు, సంబంధ్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

➡️