పట్టుసడలని పోరు

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర

శ్రీకాకుళం అర్బన్‌ : భిక్షాటన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

  • తొమ్మిదో రోజుకు అంగన్వాడీల సమ్మె
  • భిక్షాటన, వంటావార్పుతో వినూత్న రీతిలో నిరసనలు
  • పలాసలో అంగన్వాడీ కేంద్రాన్ని తెరుస్తున్న అధికారులను అడ్డుకున్న స్థానికులు

ప్రజాశక్తి – విలేకరుల యంత్రాంగం కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు పట్టు సడలకుండా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి తొమ్మిదో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా భిక్షాటన, వంటావార్పు, నోరు చెవులు మూసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్ల కూడలి వద్ద భిక్షాటన చేపట్టిన అనంతరం మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షులు కె.కళ్యాణి, టి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్లలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, వై.విజయలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు. రణస్థలంలో నోరు, చెవులు మూసుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.సుజాత తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో భిక్షాటన చేపట్టారు. రైతుసంఘం నాయకులు పి.సాంబమూర్తి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు డి.ఆదిలక్ష్మి, పి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కొత్తూరులో వంటావార్పు చేపట్టి సమ్మె శిబిరాల వద్దే భోజనాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు. కె.లక్ష్మీహేమ, ధనలక్ష్మి, జలజాక్షి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిర్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, సిఐటియు నాయకులు హెచ్‌.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా భిక్షాటన చేపట్టారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ కండ్రపేట మీదుగా ఐసిడిఎస్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పంచాది లతాదేవి, పి.భూలక్ష్మి, పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పలాసలో కాశీబుగ్గ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు నుంచి మూడు రోడ్ల జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టి అక్కడ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌.మోహనరావు, బమ్మిడి ఆనందరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొందూరులో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. విఆర్‌ఎ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.త్రినాథరావు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ సమ్మె శిబిరంలో పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.జ్యోతిలక్ష్మి, జి.నాగరత్నం, ఎస్‌.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.అధికారులను అడ్డుకున్న స్థానికులుపలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలోని శాంతినగర్‌ అంగన్వాడీ కేంద్రం తాళం పగులకొట్టేందుకు ప్రయత్నించిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. అంగన్వాడీ కేంద్రం తాళాలు పగులకొట్టేందుకు సిద్ధమవుతున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్యకర్త లేకుండా తాళాలు ఎలా పగులకొడతారని అధికారులను ప్రశ్నించారు. మీ సమస్యలపై మీరు సమ్మె చేయరా..? మీకు తక్కువ జీతాలు ఇస్తే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించరా అని నిలదీయడంతో అధికారులు వెనుదిరిగారు.మున్సిపల్‌ కమిషనర్‌తో అంగన్వాడీల వాగ్వివాదంఇచ్ఛాపురం పట్టణంలోని గొల్లవీధికి చెందిన అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు వెళ్లిన మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, సచివాలయ సిబ్బందిని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కమిషనర్‌ అంగన్వాడీ కార్యకర్తను పక్కకునెట్టి సచివాలయ సిబ్బందితో తాళాలు పగులగొట్టించారు. దీంతో అధికారులతో అంగన్వాడీలు వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెరుస్తున్నామని కమిషనర్‌ సర్దిచెప్పడంతో అంగన్వాడీలు వెనుదిరిగారు. సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని కేంద్రంలోని సరుకులను నమోదు చేశారు.అంగన్వాడీ సహాయకురాలికి అస్వస్థతటెక్కలిలో అంగన్వాడీల భిక్షాటన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నందిగాం మండలం మణిగాంకు చెందిన అంగన్వాడీ సహాయకురాలు బొడ్డ రమణమ్మ ఇందిరాగాంధీ కూడలి వద్ద సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెను స్థానిక జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

 

 

➡️