పాతపట్నంలో అ’శాంతి’

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై అసమ్మతి పతాక స్థాయికి చేరింది. పాతపట్నంలో శుక్రవారం ఎఎస్‌ఎన్‌ కళ్యాణ

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై పతాకస్థాయికి చేరిన అసమ్మతి

పేలవంగా ‘మేము సిద్ధం… బూత్‌ సిద్ధం’

సమావేశాన్ని బహిష్కరించిన వైసిపి ముఖ్య నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై అసమ్మతి పతాక స్థాయికి చేరింది. పాతపట్నంలో శుక్రవారం ఎఎస్‌ఎన్‌ కళ్యాణ మండపంలో నిర్వహించిన ‘మేం సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ సమావేశానికి ముఖ్య నాయకులు బహిష్కరించారు. నియోజకవర్గం పరిధిలోని పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి మండలాలకు చెందిన పార్టీ శ్రేణులతో పాతపట్నంలో భారీగా సమావేశం నిర్వహించి తన పట్ల అసమ్మతి ఏమీ లేదని చాటుకోవాలని ఎమ్మెల్యే, అనుచరులు భావించారు. సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు ఇంటింటికీ వెళ్లి మరీ పిలిచారు. అయినా ఫలితం కనిపించలేదు. పార్టీ ముఖ్య నాయకులు, వారి అనుచరులు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో సమావేశం అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాకపోవడంతో ఆమె అనుచరుల్లో నైరశ్యం అలుముకుంది. పాతపట్నం సమావేశానికి పార్టీ డిప్యూటీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వైసిపి జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ హాజరవుతున్నారని సమాచారమిచ్చినా… సమావేశానికి వచ్చేందుకు నాయకులెవరూ ఇష్టపడలేదు. ఐదు మండలాలకు చెందిన ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, పలువురు సర్పంచ్‌లు గైర్హజరయ్యారు. నియోజకవర్గంలో 160 పంచాయతీలు ఉండగా, 90 పంచాయతీల నుంచి నాయకులు, వారి అనుచరులు హాజరు కాలేదని తెలుస్తోంది. ఇందుకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి వైఖరే ప్రధాన కారణమని అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి ప్రారంభమైన అసమ్మతి ఇంతింతై వటుడింతై అన్నట్లు తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల సమయంలో ఒంటెత్తుపోకడలతో ఇష్టానుసారం వ్యవహరించడంతో అన్ని మండలాల నాయకులు తిరగబడ్డారు. ఎంపిపి, వైస్‌ ఎంపిపి, జడ్‌పిటిసిల పదవులకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియర్లను, తొలి నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టడంతో అసమ్మతికి బీజం పడింది. అసమ్మతి క్రమేణా పెరిగి జగన్‌ ముద్దు, ఎమ్మెల్యే వద్దు అంటూ నాయకులు, పార్టీ శ్రేణులు రోడ్డెక్కిన పరిస్థితికి దారి తీసింది. చివరకు ఈ నెల 25న పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డిని సైతం కలిసారు. రెడ్డి శాంతికి టికెట్‌ ఇస్తే ఓటమి తప్పదని తేల్చి చెప్పారు. కొత్తూరు వైస్‌ ఎంపిపి తులసీవరప్రసాదరావుకు టిక్కెట్‌ ఇస్తే గెలిపించుకుంటామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసమ్మతికి అద్దం పడుతున్న ‘సిద్దం’ సమావేశం’మేం సిద్ధం, మా బూత్‌ సిద్ధం’ నినాదంతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య నాయకులు, వారి అనుచరులు, గైర్హాజరు కావడం నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతికి అద్దం పడుతోంది. నియోజకవర్గంలో మొత్తం 322 బూత్‌లు ఉండగా బూత్‌కు 15 మంది చొప్పున సమావేశానికి 4830 మంది హాజరు కావాల్సి ఉంది. సమావేశానికి మాత్రం కేవలం 250 నుంచి 300 మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రెడ్డి శాంతితో తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధమైన అసమ్మతి నాయకులు, బూత్‌ కమిటీ సభ్యులు సమావేశానికి గైర్హాజరయినట్లు తెలిసింది. పాతపట్నంలో అభ్యర్థిని మార్చడం తప్ప వేరే మార్గం లేదని వారు తేల్చి చెప్తున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వై నాట్‌ 175 అంటున్నా… ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని మార్చకుంటే ఓటమి తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

➡️