పింఛన్ల సొమ్ము దారిమళ్లింపు

ఖజానాలో నిధులు దారి మళ్లించడంతోనే

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

  • ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

ప్రకాశక్తి- కవిటి

ఖజానాలో నిధులు దారి మళ్లించడంతోనే పింఛన్లు సకాలంలో పంపిణీ చేయలేకపోతున్నారని, మార్చి 16 నుంచి 30 వరకు రూ.13 వేల కోట్ల పింఛన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు ముఖ్యమంత్రి తన సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆరోపించారు. మండలంలోని రామయ్యపుట్టుగలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల సొమ్ము ప్రజల ఇంట వద్దకే పంపిణీ చేయకుండా టిడిపి అడ్డుకుందని వైసిపి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వాస్తవానికి వారి దోపిడీకి ప్రస్తుతం ఖజానా ఖాళీ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఉన్నప్పుడు ఇంటివద్దకే వెళ్లి పింఛన్లు అందించడంలో ప్రభుత్వం ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తోందని ప్రశ్నించారు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్ల సొమ్ము, జనవరి 23న ఇవాల్సిన ఆసరా డబ్బులు, ఫిబ్రవరి 16న బటన్‌ నొక్కిన చేయూత డబ్బులు, ఫిబ్రవరి 29న బటన్‌ నొక్కిన విద్యా దీవెన, మార్చి 14న బటన్‌ నొక్కిన ఇబిసి నేస్తం పథకాలకు చెందిన మొత్తం రూ.13 వేల కోట్లు కేవలం 15 రోజుల్లో తన అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంతో ప్రస్తుతం పింఛన్లకు కొరత ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి టిడిపిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెలనెలా ఇంటి వద్దకే రూ.4 వేలు పింఛన్‌ అందిస్తామని, వైసిపి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం ప్రజాసేవలో ఉండే వాలంటీర్లను తమ ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తామని పేర్కొన్నారు. రోజురోజుకూ దిగజారుతున్న తమ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తోందని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️