పెండింగ్‌ ఫారాలు పూర్తి చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారం-6, 7 పరిశీలనను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. ఎలక్ట్రోరల్‌ తొలగింపులు, చేర్పులు, మార్పులు, పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఓటర్ల చేర్పులు, తొలగింపులు, పరిశీలన దాదాపుగా పూర్తయిందని తెలిపారు. శతశాతం పూర్తి చేయడానికి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, పోలింగ్‌ సిబ్బందిని నియమించి శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఆర్‌ఒలు, ఎఆర్‌ఒలు, మాస్టర్‌ ట్రైనర్స్‌కు జిల్లాస్థాయిలో శిక్షణ పూర్తి చేసినట్లు వివరించారు. ఎస్‌పి జి.ఆర్‌ రాధిక మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఉన్న పరిస్థితులను వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. బోర్డర్‌ వద్ద పరిస్థితులు, పోలీసులకు ఎన్నికలకు సంబంధించి మాస్టర్‌ ట్రైనర్స్‌ పోలీసు అధికారులకు మూడు రోజులు పాటు శిక్షణ పూర్తి చేశామన్నారు. అవసరమనుకుంటే రిటైర్డ్‌ పోలీసులు, ఎక్స్‌ ఆర్మీ సిబ్బందినీ వినియోగించుకునేందుకు వివరాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జెడ్‌పి సిఇఒ వెంకటేశ్వరరావు, ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య పాల్గొన్నారు.

 

➡️