పొంచి ఉన్న ‘మిచౌంగ్‌’

మిచౌంగ్‌ తుపాను ప్రభావం జిల్లాకు పొంచి ఉంది. తుపాను ప్రభావంతో జిల్లాలో సోమవారం పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఆమదాలవలసలో గరిష్టంగా 15.75 మిల్లీమీటర్ల వర్షపాతం

బూర్జ : తడిసిన వరి ఓవులు

  • జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
  • నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఎగసిపడుతున్న అలలు
  • తుపాను నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలు రద్దు
  • నేడూ విద్యాసంస్థలకు సెలవు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

మిచౌంగ్‌ తుపాను ప్రభావం జిల్లాకు పొంచి ఉంది. తుపాను ప్రభావంతో జిల్లాలో సోమవారం పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఆమదాలవలసలో గరిష్టంగా 15.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 14.25 మి.మీ, ఆమదాలవలస మండలం చింతాడలో 13.25 మి.మీ వర్షం కురిసింది. లావేరు మండలం తామడలో 13 మి.మీ, గార మండలం తూలుగులో 11.75 మి.మీ వర్షం పడింది. సోంపేట మండలం కొర్లాంలో కనిష్టంగా 0.25 మి.మీ వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రైల్వే శాఖ జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. జిల్లాకు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మంగళవారమూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను వల్ల జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ జిల్లాలోని తీర ప్రాంత మండలాల అధికారులు, ఫ్రంట్‌ లైన్‌ అధికారులతో మాట్లాడారు. తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సత్వరమే చర్యలు చేపట్టేలా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వరి కోతలు కోయరాదని ముందుగానే హెచ్చరించామని, భారీ వర్షాలు కురిస్తే ఆహార పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జయదేవి, జిల్లా వ్యవసాయ అధికారి కె.శ్రీధర్‌, వంశధార ప్రాజెక్టు ఎసవి డోల తిరుమలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.మిల్లులకు ధాన్యం తరలింపునూర్పులు పూర్తయిన ధాన్యం తడిచిపోయి రైతులు నష్టపోకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ, ఆర్‌బికె అధికారులు గ్రామాల్లో పర్యటించి నూర్పులు పూర్తి చేసిన ధాన్యం తరలింపునకు చర్యలు చేపడుతున్నారు. ధాన్యం బస్తాలను సమీప మిల్లులకు అధికారులు తరలించారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు కోత కోసిన పంటను కుప్పలు పెట్టుకున్నారు. టార్ఫాలిన్లు కప్పి పంటను భద్రపరుచుకున్నారు. మరికొన్నిచోట్ల నూర్పులు చేశారు.వేటకు దూరంగా మత్స్యకారులు తుపాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసి పడుతున్నాయి. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు సూచించారు. దీంతో వారు ఇళ్లకే పరిమితమయ్యారు. వలలు, పడవలను భద్రపరుచుకున్నారు.విద్యాసంస్థలకూ నేడూ సెలవుతుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారమూ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలవుకు బదులుగా ఈనెల తొమ్మిది లేదా పదో తేదీన పని దినంగా ఉంటుందని తెలిపారు. తుపాను కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటుతుపాను నేపథ్యంలో జిల్లాలో విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఎపిఇపిడిసిఎల్‌ పర్యవేక్షణ ఇంజినీర్‌ ఎన్‌.కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. నివాస ప్రాంతాల్లో విద్యుత్‌ వైర్లు కిందపడినా, స్తంభాలు విరిగినా, వంగినా, ట్రాన్స్‌ఫార్మర్‌ ఫ్యూజు బాక్సులు ప్రమాదకరంగా ఉన్నా తక్షణమే కంట్రోల్‌రూమ్‌ నంబర్లకు తెలియజేయాలని కోరారు. శ్రీకాకుళం సర్కిల్‌ కార్యాలయం 9490612633, శ్రీకాకుళం డివిజన్‌ కార్యాలయం 9440635529, టెక్కలి డివిజన్‌ కార్యాలయం 9490610050, పలాస డివిజన్‌ కార్యాలయం 7396615568, సెంట్రలైజ్డ్‌ కాల్‌ సెంటర్‌ టోల్‌ఫ్రీ నంబరు 1912 నంబర్లకు ఫోన్‌ చేయాలని వినియోగదారులను కోరారు. తుపాను దృష్ట్యా జిల్లాలో తక్షణ విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చర్యల నిమిత్తం 13,033 విద్యుత్‌ స్తంభాలు, 421 కిలోమీటర్ల కండక్టర్లు, 961 ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 750 మంది విద్యుత్‌ కార్మికులను 70 బృందాలుగా విభజించి సమస్యాత్మక ప్రాంతాలకు పంపించామని పేర్కొన్నారు. 1400 మంది విద్యుత్‌ సిబ్బంది పునరుద్ధరణ చర్యలకు సిద్ధంగా ఉంచామని తెలిపారు.

 

 

➡️