పోలియో నిర్మూలనే లక్ష్యం

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌, కమిషనర్‌

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. నగరంలోని పాతశ్రీకాకుళం సంతోషి మాత ఆలయం కూడలి వద్ద పల్స్‌పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్‌, ఆయన సతీమణి, నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియాలు ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. పోలియో మహమ్మారి బారిన పడితే జీవితాంతం మానసికంగా ఆవేదన ఉంటుందని, తల్లిదండ్రులు దీనిని గ్రహించాలని సూచించారు. చిన్నారులను చక్కగా పెంచి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం ధ్యేయంగా ఉండాలని పేర్కొన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని, భవిష్యత్‌ బాగుంటుందని అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. పోలియో లేని రాష్ట్రంగా ఆవిర్భవించాలని, పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి, జిల్లా ఇమ్యూనేజేషన్‌ అధికారి డాక్టర్‌ ఎస్‌.ఈశ్వరిదేవి, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, స్వచ్ఛంద సేవకులు మంత్రి వెంకటస్వామి, డాక్టర్‌ జాన్‌, హెచ్‌.ఇ,మోహిని, మహిళా సూపర్‌వైజర్‌ లక్ష్మి, అంగన్వాడీ వర్కర్ల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️