పోలీసులపై ఫిర్యాదులకు ప్రత్యేక అథారిటీ

పోలీసులపై చర్యలకు

మాట్లాడుతున్న సంస్థ జిల్లా చైర్మన్‌ వరప్రసాదరావు

  • పోలీసు ఫిర్యాదుల ప్రాధికార సంస్థ జిల్లా చైర్మన్‌ వరప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

పోలీసులపై చర్యలకు సంబంధించి ప్రజల ఫిర్యాదుల పరిష్కారం కోసం పోలీసు ఫిర్యాదుల ప్రాధికార (అథారిటీ) సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ జిల్లా చైర్మన్‌, విశ్రాంత జిల్లా జడ్జి ఎ.వరప్రసాదరావు తెలిపారు. నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కస్టడీలో మృతి, దాడి, అత్యాచారం వంటి ఘటనలు చోటుచేసుకున్న సందర్భంలో విచారణ చేపట్టి పోలీసులపై చర్యలకు తమ సంస్థ సిఫార్సు చేస్తుందని చెప్పారు. మానవ హక్కులను ఉల్లంఘించే కానిస్టేబుల్‌ నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ స్థాయి వరకు పోలీసు అధికారులపై ఫిర్యాదులను పరిశీలించడానికి జిల్లాస్థాయిలో ఈ అథారిటీ పనిచేస్తుందని తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్‌, అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులపై ఫిర్యాదులను పరిశీలించడానికి రాష్ట్రస్థాయి అథారిటీ పనిచేస్తుందని చెప్పారు. ప్రజలను తమ కార్యాలయాలకు పిలిపించి చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, శారీరక హింస, మాటలతో దుర్భాషలాడడం వంటి ఘటనల్లో సంబంధిత పోలీసు అధికారుల చర్యల కోసం తమకు పిటిషన్లు అందజేయవచ్చని చెప్పారు. తమ అథారిటీకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి జిల్లాల పరిధి ఉందని, ఫిర్యాదులు నేరుగా గానీ ఆన్‌లైన్‌ ద్వారా గానీ 9494841172 ఫోన్‌ నంబరును సంప్రదించడం ద్వారా గానీ అందజేయవచ్చన్నారు. 2021 జూలైలో ఏర్పడిన ఈ అథారిటీకి ఇప్పటి వరకు 54 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. నేరం జరిగిందని భావించిన సంవత్సరం లోపు, పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించినా ఎలాంటి చర్యలు తీసుకోని ఫిర్యాదులను తాము స్వీకరిస్తామని తెలిపారు. సమావేశంలో అథారిటీ సభ్యులు విశ్రాంత అదనపు జాయింట్‌ కలెక్టర్‌ పి.రజినీకాంతరావు, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, విశ్రాంత అధికారి కె.రంగరాజు ఉన్నారు.

 

➡️