ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యారోగ్యశాఖ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ సూచించారు. జిల్లాలో అందుతున్న వైద్య సేవలు, నెలవారీ లక్ష్యాలు, ప్రగతి తదితర అంశాలపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామస్థాయి నుంచి వైద్య సేవలందించే ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 14 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ గురించి తెలుసుకున్నారు. అసంక్రమిత వ్యాధుల సర్వే, ఆయుష్మాన్‌ భారత్‌ సర్వే, ఎఎన్‌ఎం, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది సంఖ్య, ఖాళీల వివరాలు అడిగారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది పనితీరును మెరుగుపరచాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, మాతా శిశు మరణాల నివారణలో భాగంగా ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో ఒపి సేవలు పెరగాలన్నారు. వైద్యాధికారులు పనితీరును మెరుగుపరుచుకుని ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు తమ పరిధిలోని గర్భిణులకు స్కానింగ్‌, గైనికాలజిస్ట్‌ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా అందించే వైద్య సదుపాలయాలను మరింత మంది సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ ప్రసాదరావు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సి.పి శ్రీదేవి, డిపిఎంఒ వెంకటలక్ష్మి, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త ప్రకాశరావు, మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️