బకాయిల విడుదలకు కృషి చేయాలి

ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు

వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

  • రెవెన్యూ మంత్రి ధర్మానకు యుటిఎఫ్‌ వినతి

శ్రీకాకుళం: ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ప్రతినెలా 1న జీతాలు చెల్లించే విధంగా నిబంధనలు ఉన్నా… రెండేళ్లుగా ఈ నిబంధనలు ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ అన్నారు. మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15వ తేదీ వచ్చినా ఇప్పటికీ చాలా మందికి జీతాలు చెల్లించలేదని వివరించారు. దీనివల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. బ్యాంకు లోన్లు కలిగిన వారికి ప్రతినెలా సకాలంలో వాయిదాలు చెల్లించినందున పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ ఏడాది ఆగస్టు 24న జరిగిన ఉద్యోగుల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పిఆర్‌సి, డిఎ అరియర్లు, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, సరెండర్‌ లీవులు తదితర బకాయిలను సెప్టెంబరు నెలాఖరులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, మూడు నెలలు గడిచినా ఎటువంటి పురోగతి లేదన్నారు. ఇచ్చిన హామీలపై ఆర్థికశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎటువంటి ఫలితం లేదని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,300 మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పిఎఫ్‌ బకాయిలు ఉన్నాయని అన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, జిల్లా కార్యదర్శి హనుమంతు అన్నాజీరావు, జిల్లా నాయకులు కె.సురేష్‌కుమార్‌, కె.వెంకటరావు ఉన్నారు.

 

➡️