బల్క్‌ దరఖాస్తులు ఇస్తే క్రిమినల్‌ చర్యలు

ఓటర్ల జాబితాలో సవరణల కోసం చేపడుతున్న ప్రక్రియలో ఎవరైనా గంపగుత్త (బల్క్‌)గా దరఖాస్తులు ఇస్తే క్రిమినల్‌ చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ హెచ్చరించారు. పరిపూర్ణమైన

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

  • కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఓటర్ల జాబితాలో సవరణల కోసం చేపడుతున్న ప్రక్రియలో ఎవరైనా గంపగుత్త (బల్క్‌)గా దరఖాస్తులు ఇస్తే క్రిమినల్‌ చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ హెచ్చరించారు. పరిపూర్ణమైన ఓటర్ల జాబితా తయారు చేయడానికి జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. పార్టీల బూత్‌ స్థాయి ఏజెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తే చిన్న చిన్న తప్పిదాలకు సైతం ఆస్కారం ఉండదన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి కలెక్టరేట్‌లోని సమావేవ మందిరంలో రాజకీయ పార్టీలతో జిల్లాస్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత తమ పార్టీకి చెందిన వారి ఓట్లు గల్లంతయ్యాయని, గంపగుత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారంటూ కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అలాంటివి ఏమైనా ఉంటే పోలింగ్‌ స్టేషన్‌ నంబర్లతో రాతపూర్వకంగా ఆధారాలతో తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంతో కష్టపడి పనిచేసే యంత్రాంగంపై బురద జల్లరాదని, వారిపై నమ్మకం ఉంచాలని కోరారు. తెలంగాణలో ఓటు వేసిన వారిని మన రాష్ట్రంలోనూ ఓటర్లుగా నమోదు చేసేందుకు ఒక పార్టీ ప్రయత్నిస్తోందని వైసిపి నాయకులు రౌతు శంకరరావు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌ ఈ అంశాన్ని పరిశీలిస్తోందని కలెక్టర్‌ చెప్పారు. ఈనెల 9వ తేదీన బల్క్‌గా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని, ఆ ఒక్కరోజు వివరాలు అందజేయాలని టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు కోరారు. బల్క్‌గా దరఖాస్తులు ఇచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని, ఎలాంటి దరఖాస్తులనైనా ముగ్గురు సభ్యుల బృందం పరిశీలిస్తోందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రాగోలు, గూడెం, చాపురం పంచాయతీ పరిధిలో 2004 నుంచి వైద్య విద్యార్దుల ఓట్లు అలాగే ఉండిపోయాయని వాటిని తొలగించడం లేదని బిఎస్‌పి నాయకులు ఆర్‌.సోమేశ్వరరావు తెలిపారు. రెండు నెలల కిందటే ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలనలో అలాంటి వాటిని తొలగించామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇంకా అలాంటి ఓట్లు ఉంటే పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఈనెల 26వ తేదీలోగా అన్ని రకాల క్లయిమ్‌లను పరిష్కరించి మార్పులు, చేర్పులు, ఇతర సవరణలతో కూడిన పూర్తిస్థాయి ఓటర్ల జాబితాను జనవరి 5న విడుదల చేస్తామని తెలిపారు.

 

 

➡️