భోగి మంటల్లో ఎస్మా జిఒ ప్రతులు

అంగన్వాడీల వేతనాలు వెంటనే

శ్రీకాకుళం అర్బన్‌ : భోగి మంటల్లో జిఒ ప్రతులను వేస్తున్న నాయకులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, పొందూరు, కోటబొమ్మాళి

అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని, ఎస్మాను ప్రయోగిస్తూ జారీ చేసిన జిఒ నంబరు 2ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారానికి 34వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా జ్యోతిరావు పూలే పార్కు వద్ద సమ్మె శిబిరంలో భోగి మంటలు వేసి జిఒ నంబరు 2 ప్రతులను దగ్ధం చేశారు. శిబిరం వద్ద అంగన్వాడీల కుటుంబసభ్యులు, లబ్ధిదారులతో కలిసి పిల్లలకు భోగి పళ్లు వేసి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎన్ని నిర్బంధాలు విధించినా, అంతకు రెట్టించిన ఉత్సాహంతో పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల మంది అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మొండివైఖరి వీడకపోవడం దారుణమన్నారు. అంగన్‌వాడీల సంక్షేమం కోసం గ్రాట్యుటీని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు, నోటీసులు ఇవ్వడం మానుకోవాలని, తక్షణమే న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఐసిడిఎస్‌కు బడ్జెట్‌లో నిధులు పెంచి వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ నిర్బంధాలు, అరెస్టులు, కేసులకు భయపడేది లేదన్నారు. నిరవధిక నిరాహార దీక్షకైనా వెనకాడేది లేదని తెలిపారు. అంగన్వాడీలకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.సుజాత, నాయకులు ఎం.నాగరత్నం, కె.విజయలక్ష్మి, కె.జ్యోతి, ఎస్‌.చిట్టితల్లి, ఎల్‌.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.పొందూరు మండలం లోలుగులో జగనన్నకు చెబుదాం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.జ్యోతిలక్ష్మి, జి.భారతి, సిహెచ్‌.సూర్యకళ, కె.చిన్నమ్మడు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన అంగన్వాడీ సిబ్బంది గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సిఐటియు నాయకులు హనుమంతు ఈశ్వరరావు, అంగన్వాడీలు పాల్గొన్నారు.

 

➡️