మహిళలను మహారాణులుగా చేసింది జగనే

మహిళలను మహారాణులుగా చేసిన ఘనత సిఎం వై.ఎస్‌.జగన్మోన్‌రెడ్డే

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస

మహిళలను మహారాణులుగా చేసిన ఘనత సిఎం వై.ఎస్‌.జగన్మోన్‌రెడ్డే దక్కుతుందని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్‌నే చేయలని మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస జూనియర్‌ కళాశాల మైదానం, సంత మైదానంలో ఆసరా 4వ విడత పంపిణీ సంబరాలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఎంత అప్పు అంత అప్పు నాలుగు విడతల్లో మాఫీ చేశారని అన్నారు. గత పాలనలో పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలు చుట్టూ తిరిగి, వారికి ఎంతో కొంత ఇచ్చుకొని, ఇంటికి పసుపుజెండా కట్టి, పసుపు చీరతో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. వైసిపి ప్రభుత్వం రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. గత పాలన కావాలా? నేటి పాలన కావాలో చెప్పాలని మహిళలకు ప్రశ్నించారు. మరో పది రోజులలో ఆసరా పథకం నగదు మహిళా సంఘాల సభ్యుల ఖాతాల్లో జమకానున్నాయని అన్నారు. పథకాల కింద ప్రజలకు డబ్బులు చెల్లిస్తుంటే చంద్రబాబు సోమరిపోతులని చేస్తున్నారని అన్నారు. పేదలకు ఇళ పట్టాలు ఇవ్వనీయకుండా కోర్టులో కేసులు కూడా వేశారని అన్నారు. టిడిపి నాయకులకు 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో చేసిన మేలు ఏమిటే చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వంలో పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటింటికీ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఎక్కడో ఉన్న వంశధార నుంచి శుద్ధ జలాలను తెచ్చి ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా నీటిని అందిస్తున్నామని అన్నారు. గతంలో ఏ గ్రామంలోనైనా పైపులైన్‌ వేసి నీరు అందించారా? అని ప్రశ్నించారు. సమావేశంలో పలాస ఎంపిపి ఉంగ ప్రవీన, పిఎసిఎస్‌ అధ్యక్షులు పైల వెంకటరావు, ఉంగ సాయి, ఎంఎస్‌ మూర్తి, మునిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు. ఎఎంసి చైర్మన్‌ పి.వి.సతీష్‌. కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, ఎపిడి మల్లేశ్వరరావు, ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌నాయుడు పాల్గొన్నారు.

 

➡️