మాట ఇచ్చి మోసం చేశారు

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను

మాట్లాడుతున్న లోకేష్‌

  • సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
  • అధికారంలోకి వస్తే పూర్తి చేస్తాం
  • జీడిపిక్కలకు మద్దతు ధర కల్పిస్తాం
  • మంత్రి అప్పలరాజు కొండలను మింగేస్తున్నారు
  • ‘శంఖారావం’లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీనిచ్చిన వైసిపి ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా రైతులను మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసేందుకు చేపట్టిన శంఖారావం యాత్ర ఇచ్ఛాపురంలో ఆదివారం ప్రారంభమైంది. ఈసందర్భంగా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి 60 హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం, ఆఫ్‌షోర్‌, కరకట్టల పనులు పూర్తి చేయకుండా అర్ధాంతరంగా వదిలేశారని చెప్పారు. కోకోనట్‌ పార్కును ఏర్పాటు చేస్తామన్నారని, కనీసం బాహుదా ఛానల్‌ మరమ్మతులు అయినా చేశారా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో జగన్మోహన్‌ రెడ్డి జిల్లాకు చేసిందేమిటని ప్రశ్నించారు. రెండు నెలలు ఓపిక పడితే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను మొదటి మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో జీడి రైతుల సమస్యలను తెలుసుకున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే పిక్కలకు మద్దతు ధర ప్రకటిస్తామని హామీనిచ్చారు. జీడి పరిశ్రమలూ సంక్షోభంలో ఉన్నాయని, వాటినీ ఆదుకుంటామని చెప్పారు. కొబ్బరి, జీడిపప్పు రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పలాసలో డిఫెన్స్‌ ఆర్మీ కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రలో సెజ్‌ ఏర్పాటు చేసి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. జిల్లాలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వలలు, బోట్లు, ఐస్‌ బాక్సులు కూడా సబ్సిడీ ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే గతంలో కన్నా రెట్టింపు సాయం అందిస్తామని హామీనిచ్చారు. పలాసలో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి వంద రోజుల్లో లబ్ధిదారులకు అందిస్తామన్నారు.మంత్రి అప్పలరాజుపై తీవ్ర విమర్శలుపలాసలో మంత్రి అప్పలరాజు కొండలను సైతం మింగేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో మంత్రి అప్పలరాజు ఒక్క అభివృద్ధి పనిచేయలేకపోయారని విమర్శించారు. పలాసలో రూ.12 కోట్లతో లాడ్జి ఎలా కొన్నారో ప్రజలకు చెప్పాలన్నారు. అంగన్వాడీ, ఆశావర్కర్ల పోస్టులనూ అమ్ముకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయినా తన ప్రగతిభవన్‌ను మాత్రం వేగంగా పూర్తి చేసుకున్నారని విమర్శించారు. తన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలనూ వదలకుండా వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. పలాసలో బదుగురు మహిళలు ఎక్కడ, ఎలా చనిపోయారో తెలియదని, ఆ కుటుంబాలకూ న్యాయం చేయలేదన్నారు. టిడిపి, జనసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వంద రోజుల్లో కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలిటిడిపి, జనసేన మధ్య చిచ్చులు పెట్టేందుకు వైసిపి పేటిఎం బ్యాచ్‌ ప్రయత్నిస్తుందని, అందుకు రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శంఖారావం ద్వారా మనం ప్రతి ఇంటికీ వెళ్లాలని, చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా తీసుకెళ్లిన వారికి నామినేట్‌ పదవులు కట్టబెడతామని చెప్పారు.ఎక్కువ కేసులున్న వారికి నామినేటెడ్‌ పోస్టు2019 నుంచి 2024 వరకు ఎవరిపై ఎక్కువ కేసులు ఉన్నాయో వారికి నామినేటెడ్‌ పోస్టు ఇస్తానని ప్రకటించారు. జిఒ 70 ద్వారా జగన్‌ పోలీసుల పొట్ట కొట్టారని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆ జిఒను రద్దు చేస్తామన్నారు. అదనపు సరెండర్‌ లీవ్స్‌, ట్రావెల్‌ అలవెన్స్‌, నక్సల్స్‌ ఏరియా అలవెన్స్‌ కూడా తిరిగి తీసుకొస్తామన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తాం. టెక్కలి టిడిపి కంచుకోట అని, ఆనాడు ఎన్‌టిఆర్‌ టెక్కలి నుంచి పోటీ చేసి గెలిచారని గుర్తుచేశారు. ఆ ఘనతను అచ్చెన్నాయుడు ముందకు తీసుకెళ్తున్నారని, టెక్కలిలో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని తెలిపారు.టెక్కలిని జిల్లా కేంద్రం చేస్తాంతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టెక్కలిని జిల్లా కేంద్రంగా చేస్తానని టెక్కలి ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందన్నారు. బటన్‌ నొక్కడాల్లో ఆక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక అచ్చెన్నాయుడుకు హోం మంత్రి పదవి ఇవ్వాలని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కోరగా, అది తన చేతుల్లో లేదని లోకేష్‌ స్పషం చేశారు.దుష్టపాలన అంతానికి శంఖారావంరాష్ట్రంలో వైసిపి రాక్షస పాలన అంతానికి లోకేష్‌ సమర శంఖారావం పూరించారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. జగన్‌ పాలనలో అన్ని తరగతుల ప్రజలు మోసపోయారని విమర్శించారు. పలాస నియోజకవర్గం పరిధిలో కొండలను మింగేసిన మంత్రి అప్పలరాజు, వాటి వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకోవాలని ఎద్దేవా చేశారు. తనను స్టీల్‌ కుర్చీ ఎంపీ అని మంత్రి అంటున్నారని, తాను స్టీల్‌ప్లాంట్‌ వరకు ఎంపీ అని చెప్పారు. మత్స్యకార మంత్రిగా ఉన్న అప్పలరాజు మత్స్యకారులకే మేలు చేయలేదని విమర్శించారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మాట్లాడుతూ ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. రాక్షస పాలకుడితో పోరాడేందుకు కార్యకర్తలంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ కిరాయి గుండాలతో మంత్రి అప్పలరాజు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తెచ్చిన డయాలసిస్‌ సెంటర్లు, కిడ్నీ ఆసుపత్రి, పరిశోధన కేంద్రం వారి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని లోకేష్‌ని కోరారు. పలు సమస్యలపై వినతుల వెల్లువశంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన లోకేష్‌కు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు వినతిపత్రం సమర్పించారు. సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని, ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి తదితరులు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని, 117 జిఒను రద్దు చేయాలని కోరారు. ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని ఎపి సిపిఎస్‌ఇఎ నాయకులు వినతిపత్రం అందించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంప్రదాయ మత్స్యకార కండ్ర కులస్తులను ఎస్‌టిలుగా గుర్తించడంతో పాటు చట్టసభల్లో అవకాశం కల్పించాలని ఆ సామాజిక తరగతి నాయకులు విన్నవించారు. సాంకేతిక కారణాల వల్ల తిత్లీ తుపాను పరిహారం పొందలేని ఏడు వేల మందికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వంశధార-బాహుదా నదిని అనుసంధానించి ఇచ్ఛాపురం నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని రైతులు విన్నవించారు. జిల్లాలో 1998 డిఎస్‌సి క్వాలిఫై అయిన 350 మందిని రెగ్యులరైజ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతో ఒరియాలకు ఎస్‌టి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ సైనికులు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 40 వేల మందికి పైగా ఉన్న ఆర్‌ఎంపి, పిఎంపిలకు గుర్తింపు సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆర్‌ఎంపిలు విన్నవించారు. అగ్రిగోల్డ్‌ కంపెనీ మోసానికి బలైన తమకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్‌ బాధితులు కోరారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, మాజీ మంత్రి గౌతు శివాజీ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, టిడిపి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పి.చంద్రమోహన్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు దాసరి రాజు, వి.దుర్గారావు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️