ముందస్తు ప్రణాళికలతో ‘ఉపాధి’ పనుల గుర్తింపు

జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి

జి.వి చిట్టిరాజు, డ్వామా పీడీ

  • క్షేత్రస్థాయిలో అంచనాలు తయారు

* గ్రామ పంచాయతీ యూనిట్‌గా పనులు

* డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పనుల గుర్తింపునకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి చిట్టిరాజు తెలిపారు. ఇప్పటికే ప్లానింగ్‌ ప్రక్రియను ప్రారంభించామన్నారు. పూడికతీత పనులతో పాటు కొత్తగా పనులు గుర్తించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జాబ్‌కార్డు ఉన్న ఉపాధి కూలీలందరికీ పనులు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టి కూలీలకు పూర్తిస్థాయిలో డబ్బులను చెల్లించామన్నారు. పలు అంశాలను ‘ప్రజాశక్తి’ ముఖాముఖిలో వెల్లడించారు.ఉపాధి పనుల్లో ఈ ఏడాది ఎలాంటి మార్పులు రానున్నాయి?ఉపాధి హామీ పథకం అమల్లో శ్రీకాకుళం జిల్లా ఎల్లప్పుడూ ముందే ఉంటోంది. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వెళ్లే కుటుంబాలకు స్థానికంగా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు ఎప్పటికప్పుడు పథకాన్ని సమర్థవంతంగా జిల్లాలో పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఇంకా గడువున్నా, ముందస్తుగా వచ్చే ఏడాది చేపట్టబోయే పనులను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టడమైంది. 900కు పైగా గ్రామ పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో పనులు గుర్తిస్తున్నాం.ఈ ఏడాది ఎంతమేరకు ఉపాధి లక్ష్యాలను అధిగమించగలిగారు? జిల్లాలో సుమారు 6.50 లక్షల మందికి పైగా ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వారందరికీ పని కల్పించాలన్నదే లక్ష్యం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టి కూలీలకు పూర్తిస్థాయిలో కూలి మొత్తాలు చెల్లించాం. రోజుకు గరిష్ట కూలి రూ.272 పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. ప్రణాళికకు అనుగుణంగా పనులు చేయకపోవడంతో గరిష్ట కూలి పొందడంలో కొంత వ్యత్యాసాలున్నాయి. అటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఈసారి పనులు గుర్తించడం, ఎక్కువ పనిదినాలు కల్పించి గరిష్ట కూలి అందేలా చర్యలు తీసుకుంటున్నాం.మెటీరియట్‌ కాంపోనెంట్‌ లక్ష్యం ఎంతమేరకు నెరవేర్చారు? జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విడతల వారీగా ఈ భవన నిర్మాణాలు పూర్తి చేయడమవుతోంది. జగనన్న కాలనీల అభివృద్ధికి ఉపాధి పనులను అనుసంధానం చేయడం వల్ల మౌలిక వసతుల కల్పనకు ఉపకరిస్తున్నాయి. జగనన్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజి నిర్మాణం పనులు చేపట్టేందుకు వీలుంది. ఆదిశగా ఉన్నత స్థాయిలో చర్చించి పనులు మంజూరు చేయడమవుతోంది. వీటితోపాటు గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఏరియా బల్క్‌ మిల్క్‌ యూనిట్లు నిర్మాణం, వాటికి అదనపు సౌకర్యాలు సమకూర్చు కునేందుకు వీలు కల్పిస్తున్నాం. పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయడం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.మొక్కల సంరక్షణ చర్యలు చేపడుతున్నారా? జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఏడాది కోటి మొక్కలు నాటేందుకు లక్షంగా నిర్ణయించాం. నాటిన ప్రతి మొక్క జీవించే విధంగా సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. క్షేత్రస్థాయిలో వాటి సంరక్షణకు పర్యవేక్షణ చేపడుతున్నాం.

 

➡️