ముఖ్యమంత్రి మాట తప్పడం వల్లే సమ్మె

సమగ్ర శిక్షలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట తప్పడం

సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కాంతారావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సమగ్ర శిక్షలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట తప్పడం వల్లే సమ్మె చేపట్టాల్సి వచ్చిందని సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి మూడో రోజుకు చేరింది. నగరంలోని జ్యోతిరావు పూలే పార్కు వద్ద సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ పాలసీ, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మినిమం టైం స్కేల్‌, హెచ్‌ఆర్‌ఎ, డిఎ అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. పార్ట్‌ టైమ్‌ విధానాన్ని రద్దు చేసి, ఫుల్‌ టైమ్‌ కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలకు పెంచడంతో పాటు పెండింగ్‌ ఎక్స్‌గ్రేషియాలను వెంటనే చెల్లించాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియమాలు చేపట్టాలని కోరారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ (జెఎసి) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మురళీకృష్ణ, పి.తవిటినాయుడు, కోశాధికారి డి.శ్రీనివాసరావు, జె.శ్రీనివాసరావు, ఎ.అరుంధతి తదితరులు పాల్గొన్నారు.

➡️