మున్సిపల్‌ కార్మికుల ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిఐటియు

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్‌ డిమాండ్‌ చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్‌అండ్‌బి అతిధిగృహం నుంచి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 105 మున్సిపాలిటీల్లో కార్మికులంతా సమ్మెచేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మొక్కుబడి చర్చలతో కాలయాపన చేయడం సరికాదన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు మున్సిపల్‌ కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ (ఆప్కాస్‌) కార్మికులందరిని పర్మినెంట్‌ చేస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నీటిసరఫరా, వీధిలైట్లు, యూజీడి కార్మికులకు స్కిల్డ్‌, సెమిస్కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం యూనియన్‌ నాయకులతో నిర్వహించే చర్చల్లో సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు డి.యుగంధర్‌, ధనాలు చిట్టి, అరుగుల రాము, సిహెచ్‌ మురుగన్‌, పి.బాలకృష్ణ, బి.భాస్కరరావు, అరుగుల లక్ష్మి, జయ, మాధవి, టి.వెంకటలక్ష్మి, బి.స్వప్న, శేఖర్‌, అర్‌జి గణేష్‌, జె.రమేష్‌, బి.సరోజ పాల్గొన్నారు.ఆమదాలవలస : మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. పట్టణంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద శిబిరంలో వద్ద సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఐలు రాష్ట్ర కమిటీ సభ్యుడు బొడ్డేపల్లి మోహనరావు సమ్మె శిబిరాన్ని సందర్శించి మున్సిపల్‌ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. మున్సిపల్‌ కార్మికులను మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రవి సుధాకర్‌ కార్యాలయానికి పిలిపించి మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందని, సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని కోరారు. కార్మిక నాయకుడు తాడి సంతోష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేవరకు సమ్మెను విరమించేది లేదని కమిషనర్‌కు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక నాయకులు కె.శ్రీనివాసరావు, తారకేశ్వరరావు, జె.శ్రీను పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి 14వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కారం కావాలని, ముఖ్యమంత్రి జగన్‌కి మంచి ఆలోచన రావాలని దీక్ష శిబిరంలో ప్రార్థనలు చేస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమేష్‌ కుమార్‌ పట్నాయక్‌, అంతకుముందు మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ పారిశుధ్య కార్మికులతో సమ్మె విరమింపచేసేందుకు చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు తమ డిమాండ్ల పరిష్కారమయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. పలాస : మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెలో కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మురగన్‌, ఎం.రవి, దివాకర్‌, యస్‌ శంకర్‌, తిరుపతి, ప్రకాష్‌ ముఖి, సీతమ్మ, గులాబీ, సావిత్రి, లక్ష్మి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి పాల్గొన్నారు.

➡️