మూడుచోట్ల అభ్యర్థుల మార్పుపై ప్రచారం

వచ్చే ఎన్నికల కోసం వైసిపి

వీడని ఉత్కంఠ

* ఆమదాలవలస, పాతపట్నంలో మార్పు లేనట్టేనా?

* రెండు, మూడు రోజుల్లో మూడో జాబితా ఉంటుందని చర్చ

* సిట్టింగ్‌లు, సమన్వయకర్తల్లో ఆందోళన

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

వచ్చే ఎన్నికల కోసం వైసిపి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అభ్యర్థుల మార్పు, కొత్త సమన్వయకర్తలను నియమిస్తూ రెండుదఫాలుగా జాబితాలను విడుదల చేసింది. ఈనెల రెండో తేదీన విడుదల చేసిన జాబితాలో జిల్లాకు సంబంధించి మార్పులు ఉంటాయని భావించినా, ఎవరి పేర్లూ లేకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడో జాబితాలో జిల్లాకు సంబంధించిన మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎచ్చెర్ల, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గ పేర్లు వినిపిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో మరో జాబితా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడంతో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల్లో ఆందోళన నెలకొంది.జిల్లాలో అభ్యర్థులను మార్పు చేయనున్న నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ స్థానంలో కొత్త సమన్వయకర్తను నియమిస్తారంటూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. విజయనగరం జిల్లా జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నా… మజ్జి శ్రీనివాసరావు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మజ్జి శ్రీనివాసరావుకు టిక్కెట్‌ ఇస్తే అటు వైసిపి కేడర్‌తో పాటు లబ్ధి పొందిన టిడిపిలోని ఓ గ్రూపు ఆయన కోసం పనిచేయొచ్చనే అంచనాలతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎచ్చెర్లకు కొత్త సమన్వయకర్తగా చిన్న శ్రీను పేరు ప్రకటిస్తే, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలతో రాజీనామాలు చేయించి తామేమిటో అధిష్టానానికి తెలియజేయాలని గొర్లె కిరణ్‌ కుమార్‌ గ్రూపు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.టెక్కలిలో మార్పు తప్పదా?టెక్కలిలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుని ఓడించాలని వైసిపి అధిష్టానం ఒకవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే, అక్కడ పార్టీ పరిస్థితి అంతకంతకూ దారుణంగా ఉంది. తొలుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, పేరాడ తిలక్‌ మధ్య గ్రూపుల పోరు, మధ్యలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి… ఇలా గ్రూపుల పోరుతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ మూడు గ్రూపులుగా చీలింది. తర్వాత దువ్వాడ కుటుంబంలోని భార్యాభర్తల మధ్య నెలకొన్న విబేధాలు అధిష్టానం దృష్టికి వెళ్లడంతో, దువ్వాడ వాణిని టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. పార్టీ కేడర్‌ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో పాటు గ్రూపుల పోరుతో ఆమె ముందుకు వెళ్లలేకపోతున్నారు. దీంతో అక్కడ సమన్వయకర్తను మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, చింతాడ మంజు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌గా పని చేస్తున్న హనుమంతు కృష్ణారావు తనయుడు అరుణ్‌కుమార్‌ పేరునూ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అరుణ్‌కుమార్‌ మరో ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన పేరునూ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇచ్ఛాపురంలో కొత్త పేరు పరిశీలనఇచ్ఛాపురం నియోజకవర్గంలోనూ అభ్యర్థిని మార్చాలని వైసిపి అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న పిరియా సాయిరాజ్‌ను తప్పించనున్నారనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో కళింగ సామాజిక తరగతికి జెడ్‌పి చైర్‌పర్సన్‌ పదవి, యాదవ సామాజిక తరగతికి ఎమ్మెల్సీ కేటాయించినందున ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డిక సామాజిక తరగతికి ఇస్తే బాగుంటుందని పార్టీ పెద్దలు అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇచ్ఛాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. ఇచ్ఛాపురం టౌన్‌ తప్ప నియోజకవర్గంలో ఎక్కడా ఆమె ప్రభావం చూపలేరని, ఆమెను నియమిస్తే పార్టీ ఓడిపోతుందని అన్ని మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు కలిసి అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై పార్టీ మరింత కసరత్తు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.ఆ రెండింటిలో మార్పులు లేనట్టేనా?పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందని ఇటీవల జోరుగా ప్రచారం సాగినా, పాత వారినే కొనసాగిస్తారనే చర్చ నడుస్తోంది. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా అధిష్టానం పాలవలస కుటుంబంపై కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. అసంతృప్తిని చల్లార్చేందుకు ఉమ్మడి జిల్లా జెడ్‌పి మాజీ చైర్మన్‌ పాలవలస రాజశేఖరం గురువారం పాతపట్నంలో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఆమదాలవలస టిక్కెట్‌ను శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకే కేటాయించనున్నారని సమాచారం.

➡️