మెడికల్‌ రిప్స్‌ సమ్మె విజయవంతం

మందుల ధరలు తగ్గించాలని, మందులపై జిఎస్‌టి ఎత్తివేయాలని

ర్యాలీ నిర్వహిస్తున్న మెడికల్‌ రిప్స్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మందుల ధరలు తగ్గించాలని, మందులపై జిఎస్‌టి ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రెజెంటేటివ్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎంఆర్‌ఎఐ), ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు జిల్లాలోని మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ బుధవారం చేపట్టిన ఒక్కరోజు సమ్మె విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా మెడికల్‌ రిప్స్‌ విధులు బహిష్కరించి సమ్మెలో భాగస్వామ్యమయ్యారు. సమ్మెలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని చిత్తరంజన్‌ వీధిలోని మెడికల్‌ హోల్‌సేల్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ కార్యాలయాల ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.వి.టి రాజు, ఎన్‌.మహేశ్వరరావు మాట్లాడుతూ సేల్స్‌ ఆధారిత వేధింపులు ఆపాలని, మందులు ధరలు తగ్గించడంతో పాటు మందులు వైద్య పరికరాలపై జిఎస్‌టి ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అడ్డదారిలో దుకాణాలకు విక్రయిస్తున్న నకిలీ, నాసిరకం మందుల విక్రయాలను అరికట్టి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలన్నారు. మందుల రంగంలో ప్రభుత్వ కంపెనీలను బలోపేతం చేయాలన్నారు. సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగులకు వర్తించే సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయిస్‌ యాక్ట్‌ను యధాతథంగా అమలు చేయాలని, నిర్దిష్టమైన పని విధానాలను రూపొందించి అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు వాసుదేవరావు, జిల్లా కోశాధికారి వై.శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు చంద్రశేఖరరావు, మెడికల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ పాల్గొన్నారు.

 

➡️