రథసప్తమి ఏర్పాట్లు పరిశీలన

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలన

బారికేడ్లను పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈనెల 16న నిర్వహించే రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లను ఎస్‌పి జి.ఆర్‌ రాధిక బుధవారం పరిశీలించారు. పార్కింగ్‌, ట్రాఫిక్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యాత్రికులు, విఐపిలు, వివిఐపిలు, దాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ప్రవేశం వద్దకు చేరుకునే క్యూలైన్లతో పాటు ట్రాఫిక్‌, విఐపి వాహనాల రాక, రక్షణ వలయాలు ఏర్పాటు, ఆలయం నుంచి బయటకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు, చిన్న పిల్లలు, వృద్ధుల ప్రవేశానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఏటా రథసప్తమి వేడుకల సందర్బంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. అనివెట్టి మండపం, ఎదురుగా ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం ధ్వజస్తంభం వద్ద బేడా మండపం వద్ద ప్రవేశాలకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి లోపాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్‌, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఎఎస్‌పి ప్రేమ్‌కాజల్‌, డిఎస్‌పి వై.శృతి, ట్రాఫిక్‌ సిఐ అవతారం, ఒకటో పట్టణ సిఐ ఎల్‌.ఎస్‌ నాయుడు, ఎస్‌ఐ బి.గణేష్‌, ఆలయ జూనియర్‌ అసిస్టెంట్‌ బి.ఎస్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️