రాజకీయ బదిలీలు గట్టెక్కిస్తాయా?

వైసిపిలో రాజకీయ పరిణామాలు 'ఏ నిమిషానికి ఏమి జరగునో ఎవరు ఊహించదెవరని' ఓ సినీ రచయిత అన్నట్లుగా

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

వైసిపిలో రాజకీయ పరిణామాలు ‘ఏ నిమిషానికి ఏమి జరగునో ఎవరు ఊహించదెవరని’ ఓ సినీ రచయిత అన్నట్లుగా ఉంది. జిల్లాలో ఏ నేతకు ఎప్పుడు సమన్వయకర్త పదవి వరిస్తుందో ఎవరి అంచనాలకు దొరకడం లేదు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును అధిష్టానం గతేడాది టెక్కలి బాధ్యతల నుంచి తప్పించి ఆయన సతీమణి దువ్వాడ వాణిని సమన్వయకర్తగా నియమించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇక అయన అధ్యాయనం ముగిసినట్లే అంతా భావించిన సమయంలో మళ్లీ టెక్కలి అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమన్వయకర్తగా దువ్వాడ వాణిని నియమించినా పార్టీ కేడర్‌ను కలుపుకునిపోవడంలో కొంత వైఫల్యం చెందినట్లు అధిష్టానం గుర్తించింది. నియోజకవర్గంలో నెలకొన్న గ్రూపుల పోరుతో కొంత మంది నాయకులూ ఆమెకు సహకరించలేదు. దీంతో సర్వేలో ఆమెకు వ్యతిరేకంగా ఫీడ్‌ బ్యాక్‌ రావడంతో అనివార్యంగా ఆమెను మార్చారని తెలుస్తోంది. కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మునుపటి ఉత్సాహం చూపుతారా? అనేది సందేహంగానే ఉంది. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీలో మూడు ముక్కలాట సాగుతోంది. స్థానిక ఎన్నికల నుంచి సాగుతున్న గ్రూపుల పోరు ఇప్పటికీ అలానే ఉంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కేడర్‌ దువ్వాడ, తిలక్‌ వర్గాలుగా విడిపోయాయి. మరోపక్క కేంద్ర మాజీ మంత్రి కృపారాణి వర్గంగా కొంత మంది నాయకులు చలామణి అవుతున్నారు. గ్రూపుల పోరును ఎంత వరకు నెట్టుకువస్తారనేది వేచి చూడాల్సి ఉంది. అదీగాక కొద్ది నెలలు పాటు బాధ్యతలు చేపట్టిన దువ్వాడ వాణి వెంట కొంత కేడర్‌ ఉంది. ఆమెను సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించడంతో ఆగ్రహాంతో ఉన్న ఆ వర్గం దువ్వాడ శ్రీనివాస్‌కు ఎంత వరకు సహకరిస్తారనేది చూడాల్సి ఉంది. మరోవైపు అధిష్టానం మాత్రం శ్రీనివాస్‌ను అచ్చెన్నకు బలమైన అభ్యర్థిగా భావిస్తోంది. 2019 ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్‌ నాయుడుపై పోటీ చేసిన దువ్వాడ గట్టి పోటీనే ఇచ్చారు. సామాజిక సమీకరణాలు, వెన్నుపోట్ట రాజకీయాలతో కొద్ది తేడాతో ఓటమిపాలయ్యారని అధిష్టానం భావించింది. ఇప్పుడు దువ్వాడకు పట్టున్న టెక్కలి నియోజకవర్గం నుంచి బరిలో దించితే గెలిచే అవకాశలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనూ అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా జడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయను పార్టీ సమన్వయకర్తగా నియమించింది. అక్కడ మున్సిపల్‌ చైర్మన్‌ పిలక రాజ్యలక్ష్మికి ఇస్తారని ప్రచారం జరిగింది. దీనిపై నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధుల అంతా రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ… అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై పునరాలోచనలో పడిన అధిష్టానం చివరకు పిరియా విజయను సమన్వయకర్తగా నియమించినట్లు తెలిసింది. పిరియా సాయిరాజ్‌ను తప్పించడానికి అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు ప్రయత్నించినట్లు నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. మహిళ అభ్యర్థిని నియమిస్తే పార్టీకి విజయావకాశాలు పెరుగుతాయని భావించిన అధిష్టానం పిరియా విజయ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స అధిష్టానాన్ని ఒప్పించడంతో సాయిరాజ్‌ కుటుంబానికి సమన్వయకర్త బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో నెలకొన్న గ్రూపుల నేపథ్యంలో ఎలా గట్టెక్కుతారో వేచి చూడాల్సి ఉంది. ఎంపీ అభ్యర్థి విషయంలోనూ వైసిపి అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ధర్మాన సోదరులతో పాటు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంలో ఎవరో ఒకరు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ప్రధానంగా ధర్మాన సోదరుల్లో ఎవరినో ఒకరిని బరిలో దింపనుందనే చర్చ విస్తృతంగా సాగింది. టిడిపి అభ్యర్థిగా మళ్లీ పోటీ చేయనున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడుపై వెలమ సామాజిక తరగతికి చెందిన అభ్యర్థినే పోటీలో నిలపాలని అధిష్టానం ఒకానొక దశలో ఆలోచించినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఊహాగానాలకు తెరదించుతూ కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ నియమించింది. జిల్లాలో ప్రస్తుతం ఇదే పెద్ద చర్చ నడుస్తోంది. ఎంపీ రామ్మోహన్‌ నాయడుకు ఎంత వరకు పోటీ ఇవ్వగలరనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. గత ఎన్నికల్లో కాళింగ సామాజిక తరగతికి చెందిన దువ్వాడ శ్రీనివాసునే వైసిపి పోటీకి నిలిపింది. ఇప్పుడు అదే సామాజిక తరగతికి చెందిన పేరాడ తిలక్‌ను బరిలో నిలపాలని నిర్ణయించడం పార్టీకి ఎంత వరకు దోహదపడుతుందో వేచిచూడాలి. ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు ధర్మాన సోదరులతో పాటు అందరితోనూ సత్సంబంధాలు ఉండటంతో అంతా సమిష్టిగా తిలక్‌ విజయానికి పనిచేస్తారని అధిష్టానం భావించినట్లుగా తెలిసింది. టెక్కలిలో గట్టెక్కాలంటే పేరాడ్‌ తిలక్‌ గెలుపు కోసం దువ్వాడ, ఎంపీగా గెలుపొందాలంటే దువ్వాడ విజయం కోసం పేరాడ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటారని భావించిన వైసిపి టెక్కలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తినే బరిలో నిలపాలని నిర్ణయించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఎంపి రామ్మోహన్‌ నాయుడుపై పోటీ చేసి ఓటమి పాలయిన దువ్వాడ శ్రీనివాసు ఈ సారి టెక్కలిలో అచ్చెన్నాయుడుపై పోటీ చేయనున్నారు. అదేవిధంగా టెక్కలిలో అచ్చెన్నాయుడుతో ఢకొీట్టి అపజయం పొందిన పేరాడ తిలక్‌ ఈ సారి ఎంపీ రామ్మోహన్‌ నాయుడుతో తలపడనున్నారు. వైసిపిలో చేసిన ఈ రాజకీయ బదిలీలు పార్టీని ఎంతవరకు గట్టెక్కిస్తాయనేది వేచి చూడాల్సి ఉంది.

➡️