రాష్ట్రానికి బిజెపి తీరని ద్రోహం

రాష్ట్రానికి కేంద్రంలోని

నిరసన దీక్ష చేపట్టిన ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు

  • ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో విఫలం
  • బిజెపికి భజన చేస్తున్న వైసిపి, టిడిపి, జనసేన
  • ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన నిరసన దీక్ష

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా అధ్యక్షులు జి.నర్సునాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.యుగంధర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈశ్వరి విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో చట్టబద్ధంగా ఇస్తామన్న ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకుండా బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తుల పంపకాలు నేటికీ పూర్తి చేయలేదని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం పూనుకుంటోందని విమర్శించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని, విభజన హామీల్లో పేర్కొన్న కేంద్ర విద్యాసంస్థలు నెలకొల్పాలని, వాటికి అవసరమైన నిధులనూ సమకూర్చాలన్నారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌ను అభివృద్ది చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. బిజెపికి భజన చేస్తున్న వైసిపి, టిడిపి, జనసేనరాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మద్దతు పలకడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన దూషించుకుంటాయని… ఈ పార్టీలు బిజెపి భజన చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఈ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పల్లెత్తి మాట్లాడడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి, దానికి మద్దతు పలుకుతున్న రాష్ట్రంలోని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎ.సత్యనారాయణ, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌పర్సన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.పార్వతీశం, ఎం.ఆదినారాయణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.ప్రసాద్‌, జి.సింహాచలం, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ఎం.గోవర్థనరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు కె.అప్పారావు, ఎఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, పలు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️