లింగ నిర్ధారణ పరీక్షలపై పటిష్ట నిఘా

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలపై పటిష్ట నిఘా

మాట్లాడుతున్న జెసి నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలపై పటిష్ట నిఘా అవసరమని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గర్భస్థ పూర్వ, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ (పి.సి.పి.ఎన్‌.డి.టి) సలహా మండలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై సలహా మండలి సమావేశాలు డివిజన్‌ స్థాయిలో నిర్వహించాలన్నారు. తక్కువ జననాలు ఉన్న మండలాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సూచించారు. మూడు నెలల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌, అబార్షన్స్‌, డెలివరీలను పరిశీలించి కారణాలపై అధ్యయనం చేయాలన్నారు. స్కానింగ్‌ కేంద్రాల్లో సిసి కెమెరాల ఏర్పాటు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. లింగ నిర్ధారణ చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. బాలికలపై వివక్ష లేకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి మాట్లాడుతూ బాలికల జననాలు తగ్గుతున్నాయని తెలిపారు. జిల్లాలో 107 స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయని వాటిని సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, ఎఎస్‌పి తిప్పేస్వామి, డిసిహెచ్‌ఎస్‌ శ్రీనివాస్‌ నాయక్‌, డిఐఒ ఈశ్వరీ దేవి, సామాజిక కార్యకర్త మంత్రి వెంకటస్వామి, విశ్రాంత జడ్జి పి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

 

➡️