లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవకులని, ప్రజలకు మెరుగైన సేవలు

జ్ఞానసువర్ణరాజు

శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జ్ఞానసువర్ణరాజు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవకులని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగీ కృషి చేయాలని శాశ్వత లోక్‌ అదాలత్‌ (ప్రజా ప్రయోజన సేవలు) చైర్మన్‌ జి.జ్ఞానసువర్ణరాజు జిల్లా అధికారులకు సూచించారు. శాశ్వత లోక్‌అదాలత్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన హైలెవెల్‌ కమిటీ సమావేశం శనివారం న్యాయ సేవా సదన్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవలకు భంగం వాటిల్లితే, ఆ వ్యక్తి శాశ్వత లోక్‌ అదాలత్‌ను ఆశ్రయించ వచ్చన్నారు. వచ్చిన కేసులను శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ తీర్మానించి, సమస్యను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్య లేకుంటే కేసును ముగిస్తామని తెలిపారు. శాశ్వత లోక్‌ అదాలత్‌ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులు వేయడానికి ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎటువంటి కేసులనైనా రెండు నెలల్లో పరిష్కారమవుతుందని, సివిల్‌ కోర్టుల్లో మాదిరిగా ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండబోదని అన్నారు. ఇరువర్గాల వాదనలతో సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇటువంటి వ్యవస్థపై అధికారులు మరింత శ్రద్ధ వహించి, ఆయా శాఖాధికారుల నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గృహ నిర్మాణ సంస్థ, రెవెన్యూ, ప్రజా రవాణా సంస్థ, నగర పాలక సంస్థ, తపాలా, బ్యాంకింగ్‌, ఉపాధిహామీ, నీటి సరఫరా, పారిశుధ్యం, విద్య, భీమా, వైద్య సేవలు, విద్యుత్‌, టెలిఫోన్‌ తదితర సేవలు సమాజంలోని పౌరులకు పక్కాగా అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ అధికారులపై శాఖలు, సంస్థల్లోని లోపాలు కారణంగానే కోర్టును ఆశ్రయిస్తారని, అటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి కామేశ్వర్‌చంద్ర పాత్ర రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ నుంచి బి.టి.వి.రామారావు పాల్గొన్నారు.

 

➡️