ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయాలి

ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-23ను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జిల్లా అధ్యక్షులు డి.రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నగరంలోని గాంధీపార్కులోని

నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం లీగల్‌

ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌-23ను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జిల్లా అధ్యక్షులు డి.రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నగరంలోని గాంధీపార్కులోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌లో పొందుపరిచిన సెక్షన్‌ 37, 38, కొన్ని ప్రావిజన్లలో పేర్కొన్న అంశాలు ప్రజలకు, న్యాయవాదులకు గొడ్డలిపెట్టు వంటిదన్నారు. సివిల్‌ కోర్టుల పరిధి నుంచి పూర్తిగా లిటిగేషన్‌ను తప్పించి, ప్రభుత్వమే ఒక ప్రత్యేక అధికారి ట్రిబ్యునల్‌ను నియమించి లిటిగెంట్‌ పబ్లిక్‌ ఆస్తిపై హక్కులను పరిష్కరించి తీర్పు వెలువరించే అధికారం ఇచ్చిందన్నారు. ఆ అధికారి ఇచ్చే తీర్పుపై స్థానిక సివిల్‌ కోర్టులకు కాకుండా హైకోర్టుకు మాత్రమే అధికారం ఉంటుందన్నారు. దీనివల్ల న్యాయవాదుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు న్యాయం దూరమవుతుందన్నారు. అధికారుల చేతుల్లోకి వెళ్లడం ద్వారా రాజకీయ ఒత్తిళ్లకు లొంగే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐలు నాయకులు పైడి లక్ష్మీపతి, డి.ఈశ్వరరావు, వెంకటేశ్వర్లు, సాయి కిషోర్‌, విజయలక్ష్మి, ఇంద్ర నాగమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.నేటి నుంచి న్యాయవాదులు విధుల బహిష్కరణఎపి టైట్లింగ్‌ యాక్ట్‌-23ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్న బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్ని సూర్యారావు, పొన్నాడ రాము తెలిపారు. ఇదే డిమాండ్‌పై ఈనెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు విధులను బహిష్కరించినట్లు తెలిపారు. ప్రభుత్వంలో చలనం లేనందున ఆందోళనను ఉధృతం చేసేందుకు ఐదు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

 

➡️