వాలంటీర్ల సేవలు అభినందనీయం

ఒక్క రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు అందించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య

బూర్జ : ప్రశంసాపత్రం అందజేస్తున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- బూర్జ

ఒక్క రూపాయి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను అర్హత కలిగిన లబ్ధిదారులకు అందించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారిధిగా పనిచేసిన వాలంటీర్ల సేవలు అభినందనీయమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల సత్కార సభలో పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ప్రభుత్వం అందించే సేవావజ్ర, సేవారత్న, సేవా మిత్రలను స్పీకర్‌ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించడంలో ఎమ్మెల్యే కంటే వాలంటీర్లు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీ సభ్యుల పేరిట లంచాలు తీసుకుని సంక్షేమ పథకాలు అందించడం చూశామన్నారు. నేడు అర్హత ఉంటే చాలు పార్టీలు, కులాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని టిడిపి వారే అంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కర్నేన దీప, జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్‌, మండల పార్టీ అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, వైస్‌ ఎంపిపిలు కరణం కృష్ణమ నాయుడు, బుడుమూరు సూర్యారావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు నారాయణమూర్తి, మండల సచివాలయాల కో-ఆర్డినేటర్‌ గుమ్మడి రాంబాబు, సర్పంచ్‌ వేగు అనురాధ పాల్గొన్నారు.లావేరు: గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు అమోఘమైనవని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవలకు ప్రతిరూపం వాలంటర్లని, అభివృద్ధి, సంక్షేమం సిఎం జగన్మోహన్‌ రెడ్డికి రెండు కళ్లన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపిపి లుట్ట అమ్మాజమ్మ, ఎంపిపి ప్రతినిధి రొక్కం బాలకృష,్ణ జెడ్‌పిటిసి ఎం.సీతంనాయుడు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి మీసాల శ్రీనువాసరావు, ఎంపిడిఒ గొర్లె భాస్కరరావు, తహశీల్దార్‌ పి.ఆదిలక్ష్మి, ఎపిఎం మావూరి మాధవి లత, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌ : వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సిఎం జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాయలంలో వాలంటీర్ల వందనం కార్యక్రమంలో భాగంగా సన్మానించారు. అనంతరం సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులను అందజేశారు. ఎంపిడిఒ విజయలక్ష్మి, వైస్‌ ఎపిపిలు పేడాడ రమేష్‌, మన్నెల కిషోర్‌, ఎంపిటిసిలు పీత హేమలత, కూన పార్వతి, వాకాడ శ్రీధర్‌రెడ్డి, మండల ప్రత్యేక ఆహ్వానితులు నాగళ్ల శంకరరావు, సర్పంచ్‌ జి.సుజాత, బి.రామకృష్ణ పాల్గొన్నారు.

 

➡️