విఒఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

విఒఎలకు మెడపై కత్తిలా ఉన్న కాలపరిమితి సర్క్యూలర్‌ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, విఒఎల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అశిరినాయుడు

మాట్లాడుతున్న అమ్మన్నాయుడు, నాగమణి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

విఒఎలకు మెడపై కత్తిలా ఉన్న కాలపరిమితి సర్క్యూలర్‌ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, విఒఎల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అశిరినాయుడు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. స్థానిక డిఆర్‌డిఎ కార్యాలయం సమీపంలోని డచ్‌ బిల్డింగ్‌ వద్ద సిఐటియు అనుబంధ విఒఎల సంఘం జిల్లా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్న విఒఎలకు కోసం తీసుకొచ్చిన కాల పరిమితి సర్క్యూలర్‌ రద్దు చేయాలన్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. విఎఒలపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదని విమర్శించారు. గ్రామ సమాఖ్యల విలీనం ఆపాలని, సంఘాలను విడగొట్టడం, కలపడం లాంటి పనులు సెర్చ్‌ అధికారులే చేయడం సరైనది కాదని అన్నారు. విఒఎల విలీనం చేయడంత్తో వేలాది మందికి ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాజకీయ జోక్యం అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు 15 సంఘాల లోపు ఉన్న విఒఎలకు వేతనాలు చెల్లించలేదని అన్నారు. జెండర్‌, వయసు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, లోకో యాప్‌ కోసం 5జి మొబైల్‌ ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళా మార్టుల్లో బలవంతపు కొనుగోళ్లకు విఒఎలకు లక్ష్యాలు ఇవ్వడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. మహిళా మార్టులకు తగిన ప్రోత్సాహకాలు కల్పించి అభివృద్ధి చేయాలన్నారు. రికవరీ పేరుతో వేతనాల కోత విధించడం ఆపాలని డిమాండ్‌ చేశారు. అంగన్వా డీల సమ్మె పోరాటానికి సమావేశం సంపూర్ణ మద్దతు తెలియజేసింది. అంగన్వాడీల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరుతో ఇతర డిపార్ట్‌మెంట్ల ఉద్యోగులను ఏర్పాటు చేయడాన్ని తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, విఒఎ సంఘం నాయకులు డి.జోగారావు, సరిత, బి.కనకలక్ష్మి, జి.ఎర్రయ్య, పి.లక్ష్మి పాల్గొన్నారు.

 

➡️